13-07-2025 12:27:32 AM
- ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
- టీ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుతో భేటీ
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): తనకు తెలంగాణ పట్ల ఉన్న ప్రేమను, గౌరవాన్ని ఎవరూ తగ్గించలేరని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఓట్ల కోసం ఫోటోల్లో గీతలు గీసి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారిని తెలుగు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య బంధాన్ని చీల్చే ప్రయత్నాలు వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం మాత్రమేనని మాధవ్ స్పష్టం చేశారు. తాను ఒక జాతీయవాదిని, ఒక గర్వపడే తెలుగువాడినిని ఆయన అన్నా రు.
శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి భారత సాంస్కృతిక వైభవం పేరిట చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష, సంస్కృతి, గౌరవం కోసం శాసనమండలిలో చురుకుగా పనిచేసినవాడినని గుర్తుచేశారు. తెలంగాణ పట్ల, ఆ గొప్ప సంస్కృతి పట్ల తనకు ఉన్న ప్రేమ, గౌరవం రాజకీయవిమర్శలకు అతీతమన్నారు.
రజాకార్లను పొగిడే, నిజాం వారసుల ముందు తల వంచిన వారికి, తెలంగాణ ప్రజల హృదయాలలో ప్రతిఫలించే సంస్కృతి, జాతీయత, సమానత్వం అనే విలువలు ఎప్పటికీ అర్థం కావన్నారు. కాగా కొన్ని రోజుల క్రితం ఏపీ మంత్రి లోకేశ్‌ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కలిసి భారత సాంస్కృతిక వైభవం పేరిట చిత్రపటాన్ని అందించారు.
అయితే ఈ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చూపెట్టకుండా ఏపీతో కలిసి ఉన్నట్లుగా పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని చూపెట్టారు. దీంతో తెలంగాణాలో బీజేపీ పార్టీపై, మాధవ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును మాధవ్ కలిసి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చూపే చిత్రపటాన్ని అందజేయడం విశేషం.