13-07-2025 12:34:04 PM
రాష్ట్ర కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. పట్టణంలోని 23వ వార్డు బురుదగూడెంలో మార్నింగ్ వాక్ లో భాగంగా ఆదివారం వార్డులో పర్యటించి కాలనీల్లో నెలకొన్నసమస్యలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.
చెన్నూరు నియోజక వర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. పట్టణంలో వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి పారిశుద్ధం మెరుగు పరచాలని అధికారులను సూచించారు. ఈ సందర్భంగా బురదగూడెం వాసులు వార్డుల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకురాగా అధికారు ల తీరు పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాలనీలో సమస్యలు వెంటనే పరిష్కరించి మౌళిక వసతులు కల్పించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున కాలనీలలో పారిశుద్ధం మెరుగు పరచాలని అధికారులకు సూచించారు. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు పనులను సకాలంలో పూర్తి చేయాలని లేకుంటే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.