పాతబస్తీలో అమిత్ షాపై కేసు నమోదు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఫిర్యాదు
పలువురు బీజేపీ నాయకులపై కేసు నమోదు
చార్మినార్, మే 3(విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై పాతబస్తీ మొగల్‌పురా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 1వ తేదీన హైదరాబాద్‌కు విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాతబస్తీలో పర్యటించారు. అనంతరం సుధా టాకిస్ లైబ్రరీ సమీపంలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. సభా వేదికపై బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవిలత మాట్లాడుతున్న సమయంలో కొంతమంది బాలికలు స్టేజీ పైకి వచ్చి జై శ్రీరాం.. జై బీజేపీ అంటూ నాయకులతో కలిసి నినాదాలు చేశారు.
ఈ క్రమంలో అమిత్‌షా వారిని దగ్గరకు పిలిపించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో మైనర్లను భాగ్యస్వామ్యం చేయడం కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని, బీజేపీ నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ఈసీకి మొయిల్ ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఈసీ చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్‌ను ఆదేశించింది. ఈ మేరకు దక్షిణ మండలం నగర పోలీస్ కమిషనర్ డీసీపీ స్నేహా మెహ్రాకు ఆదేశాలు అందడంతో ఆమె మొగల్‌పురా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వేదికపై అమిత్‌షా ప్రసంగం చేస్తున్న సమయంలో తీసిన వీడియో ఆధారంగా ముగ్గురు బాలికలను గుర్తించారు. వీరంతా మైనర్లే కావడంతో బీజేపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొగల్‌పురా పోలీస్ స్టేషన్ వద్ద వేదిక ఏర్పాటు కోసం పర్మిషన్ తీసుకున్న యామన్‌సింగ్ ఏ1, హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవిలత ఎ2 , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఏ3, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి ఏ4, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏ5గా పేర్కొంటూ క్రైం నెంబర్ 77/2024, సెక్షన్ 188 ఐపీసీ కింద మొగల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు.




