ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ ప్రక్షాళన.. ఎవరైనా అడ్డుపడితే శివతాండవమే..!
మంచిరేవులలో ఈ కార్యక్రమం.. దేవుడి నిర్ణయం
మూసీ కాలుష్యం మానవ తప్పిదం.. ప్రకృతి తప్పిదం కాదు
హైదరాబాద్: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(Musi Riverfront Development Corporation) లిమిటెడ్ ఆధ్వర్యంలో మంచిరేవులలో మూసీ నదీ తీరాన మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి(Sri Omkareshwara Swamy Temple) ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శంకుస్థాపన చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, శంఖునాదాలు, గంటానాదాల మధ్య ఆలయ నిర్మాణానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఈ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉందని తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నదిని బాగు చేయాలని గతంలో అనేకమంది ప్రయత్నించారని సూచించారు. ఈ అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. మంచిరేవులతో ఈ కార్యక్రమం దేవుడి నిర్ణయం అన్నారు. ఓం కారేశ్వర ఆలయాన్ని నిర్మించడం భగవత్ కార్యంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం బాధ్యతే కాదు.. పవిత్ర మైన కార్యం అన్నారు.
నదీ పరీవాహక ప్రాంతాల్లోనే నాగరికత అభివృద్ధి చెందిందని సీఎం స్పష్టం చేశారు. దేశాల అభివృద్ధికి సముద్రాలు, నదులే ఆధారం అన్నారు. నదీజలాలను సరిగా వాడుకోకుంటే ఎంతో నష్టం జరుగుతోందన్నారు. తెలిసో తెలియకో నదులను కలుషితం చేస్తున్నామన్న రేవంత్ రెడ్డి కాలుష్యం వల్ల వచ్చే సమస్యలేంటో ఢిల్లీని చూస్తే తెలుస్తోందని వివరించారు. ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నారు. ఎవరైనా అడ్డు పడితే రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తోందని హెచ్చరించారు. మూసీ ఒడ్డున మసీదు, చర్చి, గురుద్వారా కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మూసీ నది గొప్ప పర్యాటక కేంద్రంగా మారబోతుందని సీఎం తెలిపారు.
గోదావరి నుంచి 20 టీఎంసీలను హైదరాబాద్ కు తరలిస్తున్నామని చెప్పిన ఆయన మూసీ నదిలో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. కాలుష్యం వల్ల భావితరాలు నాశనమయ్యే ప్రమాదం ఉందని సీఎం హెచ్చరించారు. కాలుష్యం వల్ల పిల్లలకు అనేక వ్యాధులు వస్తున్నాయని పేర్కొన్నారు. మూసీ నది కాలుష్యం మానవ తప్పిదం.. ప్రకృతి తప్పిదం కాదని ఆయన వెల్లడించారు. మానవ తప్పిదాన్ని అరికట్టాలి.. లేకుంటే భావితరాలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను చూస్తున్నాం, వాళ్లు చేయలేని పనులు ఎవరూ చేయకూడదని కొందరు అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.




