13-11-2025 01:00:51 AM
సంగారెడ్డి, నవంబర్ 12(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అంతులేకుండా పోతోంది. అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా పోయారు. బాల్కానీలను పెంచి బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారు. అనుమతులు ఒకదానికి తీసుకుంటూ.. నిర్మాణాలు మరో విధంగా చేపడుతున్నారు.
ఇంత జరుగుతు న్నా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపి స్తున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అరవింద్కుమార్ మున్సిపల్ కమిషనర్లకు సూచించినా వారిలో కదలిక కనిపించడం లేదు. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పీఎన్‌ఆర్ కాలనీలో అక్రమ నిర్మాణాలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నా ఆవైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలున్నాయి.
ఇంద్రేశం మున్సిపల్ అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడంతో అక్రమ కట్టడాలు కొనసాగుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో అక్రమ కట్టడాలను గుర్తించాల్సింది పోయి తమకేమీ పట్టనట్లుగా వ్యవ హరించడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిప్ల్సటూకే అనుమతి అని ప్రకటించినా అక్రమార్కులు 4-5 అంతస్థులు భవన నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు జీ ప్లస్ టూకు అనుమతి తీసుకొని ఐదు అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నారు.
ఈ విధం గా తప్పుడు అనుమతులతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిద్ర మత్తులో తూగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోనై, మామూళ్లకు అలవాటు పడే అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కొందరు పార్కింగ్కు సెల్లా ర్స్ వదిలేయకుండా బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టి యథేచ్ఛగా అద్దెకు ఇచ్చుకుంటున్నారు.
నోటీసులు ఇచ్చి దండుకుంటున్న అధికారులు...
ఇంద్రేశం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల జోరు యధేచ్ఛగా కొనసాగుతోంది. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు మాత్రమే అక్రమదారులకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత వారినుండి అం దినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా 20కి పైగా అనుమతులు లేకుం డా బహుళ అంతస్తులు నిర్మిస్తున్న యజమానులకు నోటీసులు జారీ చేశారు.
కానీ వాటి నిర్మాణాలు మాత్రం యధావిధిగా కొ నసాగుతున్నాయి. పైగా సదరు అక్రమార్కుల నుండి అందినకాడికి పుచ్చుకొని ని మ్మకుండి పోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో మున్సిపల్ కమిష నర్ను, టౌన్ ప్లానింగ్ సెక్షన్ సిబ్బంది వివరణ కోసం ప్రయత్నించినా అందుబాటులో ఉండడం లేదు. కనీసం ఫోన్లో సంప్రదించాలని ప్రయత్నించినా స్పందించడం లేదు.