12 March, 2026 | 3:33 PM

లోక్‌సభ స్పీకర్‌పై వీగిపోయిన అవిశ్వాసం

12-03-2026 01:41 AM
  1. మూజువాణి ఓటుతో వీగిన ప్రతిపక్షాల తీర్మానం

ఆ పదవిని రాజకీయాలతో ముడిపెట్టొద్దు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా  

మాట్లాడేందుకు మాకు సమయం ఇవ్వలేదు

విపక్ష నేత రాహుల్‌గాంధీ

ప్రధాని ఏ విషయంలోనూ రాజీ పడలేదు

బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ, మార్చి 11: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు బుధవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.మూజువాణి ఓటుతో ఈ తీర్మానాన్ని తిరస్కరించా రు. విపక్ష ఎంపీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహమ్మద్ జావేద్ ఈ తీర్మానాన్ని తొలి దఫా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టగా, రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చను ప్యానల్ స్పీకర్ జగదంబిక పాల్ చేపట్టారు.

దీనికి 118 మంది విపక్ష ఎంపీలు మద్దతు తెలిపారు. మూజువాణితో లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం వీగిపోవడంతో సభను గురువారా నికి వాయిదా వేశారు. కాగా లోక్‌సభ స్పీకర్‌పై విపక్షాలు మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా దాదాపు సుమారు 13 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. తీవ్ర గందరగోళం, ఉద్రిక్తతలు, అధికారపక్ష, విపక్ష సభ్యుల వాదోపవాదాల మధ్య తాత్కాలిక స్పీకర్ జగదాంబికా పాల్ నిర్వహించిన అవిశ్వాసం చర్చపై హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇస్తున్న సమయంలో ప్రతిపక్షాలు తీవ్రనినాదాలతో సభ ను అడ్డుకున్నాయి.

విపక్షాల సభ్యులకు అమిత్‌షా సమాధానమిస్తూ రాహుల్‌గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయాల్లో రాహుల్ గాంధీ తరచూ విదేశాలకు వెళ్తుంటారని అన్నారు. బడ్జెట్, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక చర్చల్లో పాల్గొనడానికి ఎందుకు ఇష్టపడరని అమిత్‌షా ప్రశ్నించారు. ‘సమావేశాలు వచ్చినప్పుడల్లా ఆయన విదేశీ పర్యటనలు ప్లాన్ చేసుకుంటారు.

మరి విదేశాల నుంచి ఇక్కడ మాట్లా డతారా?’ అని ఎద్దేవా చేశారు.స్పీకర్ స్థానం అత్యంత పవిత్రమైందని, ఆయన నిర్ణయాలను సుప్రీంకోర్టులో సైతం ప్రశ్నించలేమని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో, నేటి కాంగ్రెస్ మిత్రపక్షా లైన సమాజ్‌వాదీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలే స్పీకర్లపై అవిశ్వాసం పెట్టాయని గుర్తుచేశారు. ఆ సమయంలో స్పీకర్లు చైర్‌లోనే కూర్చోగా, ఈసారి ఓం బిర్లా మాత్రం తీర్మానంపై నిర్ణయం వెలువడే వరకు చైర్‌లో కూర్చోకుండా కొత్త పార్లమెంటరీ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు.

స్పీకర్ పదవికి రాజకీయాలతో సంబంధం లేదు. సభలో ఆయన అందరివాడు, అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే స్పీకర్ ఎంపిక జరిగింది. అటువంటి వ్యక్తి నిబద్ధతను, నిష్పక్షపాత వైఖరిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు.సభా నిబంధనలను కాంగ్రెస్ పార్టీ పదే పదే ఉల్లంఘిస్తోందని అమిత్‌షా ఆరోపించారు. ‘ప్రస్తు తం సభలో అమలవుతోన్న నిబంధనలు నెహ్రూ కాలంలో రూపొందబడ్డాయి, వాటి ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సభా మర్యాదలను కాపాడటంతో ప్రతిపక్షాలు విఫలమవుతున్నాయి,

నిబంధనలను పాటించకుండా స్పీకర్ పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు’ అని అన్నారు. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక స్పీకర్ పై ఇలాంటి తీర్మానం రావడం దురదృష్టకరమని, ఇది పార్లమెంటరీ సంప్రదాయాలను కించపర్చడమేనన్నారు. స్పీకర్ స్థానాన్ని రాజకీయ కోణంలో చూడటం తగదని అమిత్ షా స్పష్టం చేశారు. 

విపక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ లోక్‌సభ స్పీకర్ అంటే ఇంతకు ముందు తనకు చాలా గౌరవం ఉండేదని, కానీ గత సమావేశాల్లో తొలిసారి విపక్ష నేతను మాట్లాడనివ్వలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. చాలా అంశాల్లో మోదీ రాజీ పడ్డారని ఇంతకుముందే చెప్పానని, ప్రధాని మోదీ వైఫల్యాలపై మాట్లాడడానికి స్పీకర్ అనుమతించడం లేదని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడు మాట్లాడదామనుకున్నా, స్పీకర్ తగిన సమయం కేటాయించలేదని విమర్శించారు. దీంతో రాహుల్ ప్రసంగంపై బీజేపీ నేతలు తీవ్రఅభ్యంతరం వ్యక్తంచేశారు.

ప్రధాని మోదీ ఎప్పుడూ, ఏ విషయంలో నూ రాజీ పడలేదని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. విమర్శించారు. ప్రధాని రాజీ పడ్డారంటూ రాహుల్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు. పార్లమెంటు గౌరవాన్ని నిలబెట్టడంలో విపక్ష నేత విఫలమయ్యారని రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా విమర్శించారు.