గొర్రెల కాపరులకు రూ.2 లక్షల నగదు బదిలీ ఎప్పటిలోగా అందిస్తారు
తెలంగాణ రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం...
ముషీరాబాద్ (విజయక్రాంతి): గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోలో గొర్రెల కాపరులకు రూ.2 లక్షల నగదు బదిలీని ఎప్పటిలోగా అందిస్తారో ఈ శాసనసభ సమావేశాల వేదికగా చెప్పాలని తెలంగాణ రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర సీఎం ఎ.రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసింది. సమితి ఆధ్వర్యంలో శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్, ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర క్యాబినెట్ లో గొల్ల కురుమలకు అవకాశం కల్పించాలని, రాష్ట్ర, జిల్లా నామినేట్ పదవుల్లో తమ జనాభా ప్రాతిపదికన అవకాశం కల్పించాలని, ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిస్తూ, నూతనంగా ఏర్పడ్డ జిల్లాలకు యూనియన్లు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్సీడీసీ ద్వారా తీసుకున్న సుమారు రూ.100 కోట్ల రుణాలను మాఫీ చేయాలని, రూ.10 వేల కోట్లతో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, జిల్లాకు ఒకటి మీట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని, బెడ్ పాలక్ బీమా యోజన పథకాన్ని పునరుద్ధరించాలని, గొర్రెల పెంపకందారుల 8 నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లలకు రూ.3,000 నుంచి 5,000 వేల వరకు స్కాలర్ షిప్ గా అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సమితి ఉపాధ్యక్షులు గుండబోయిన అయోధ్య యాదవ్, నాయకులు దేశబోయిన సూర్యనారాయణ యాదవ్, వెంకటయ్య యాదవ్, రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




