1 May, 2026 | 3:32 AM

భద్రకాళి అమ్మవారికి కోటి రూపాయలతో రథం

01-05-2026 02:13 AM

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవాలయంలో అమ్మవారి ఊరేగింపు నిమిత్తము కోటి రూపాయల వ్యయంతో వరంగల్ పశ్చిమ ఎం.ఎల్.ఏ నాయిని రాజేందర్ రెడ్డి రథం ఏర్పాటు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం అడ్వాన్సుగా 45 లక్షల రూపాయలు చెల్లించి ముప్పయి అడుగుల రథం తయారీకి మహారాష్ట్ర లోని నాగపూర్ నుండి తెప్పించిన మేలు రకం టేకు కలపతో శిల్పి గిర్మాజి ప్రవీణ్ చారి ఆధ్వర్యంలో రథం తయారీకి శ్రీకారం చుట్టారు.

రథం తయారీ పనులను దేవాలయ కమిటీ చైర్మన్ డాక్టర్ బి. శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్  రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, జారతి వెంకటేశ్వర్లు, బింగి సతీష్, పాలడుగుల ఆంజనేయులు, అనంతుల శ్రీనివాస్, మూగా శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషులు పూజలు నిర్వహించి రథం చెక్కడం పనులను ప్రారంభించారు.