సీనియర్ స్టార్స్‌తో రీఎంట్రీ!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, సహజసిద్ధమైన అందంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటీమణుల్లో నివేదా పేతురాజ్ ఒకరు. ‘మెంటల్ మదిలో’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ తమిళ బ్యూటీ.. ఆ తర్వాత ‘బ్రోచేవారెవరురా’ వంటి విలక్షణమైన విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అయితే, కొంత విరామం తర్వాత నివేదా పేతురాజ్ తాజాగా టాలీవుడ్‌కు రీ-ఎంట్రీ ఇస్తోందని తెలుస్తోంది.
విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో నివేదా ఒక ప్రాధాన్యమున్న పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొంటున్నట్లు సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనస్వర రాజన్.. మెగాస్టార్ కూతురు పాత్రను పోషిస్తోంది.
ఇదే చిత్రంలో నివేదా పేతురాజ్ కథను మలుపు తిప్పే ఓ పాత్రలో నటిస్తోందని తాజాగా వార్తలు వస్తున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ మూవీ సెట్స్‌లోకి నివేదా ఇప్పటికే అడుగుపెటిందట. ఇలా ఒకేసారి అగ్ర హీరోల చిత్రాలతో నివేదా పేతురాజ్ తిరిగి టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండటంతో ఆమె కెరీర్ మళ్లీ ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.






