31 May, 2026 | 12:30 AM

ఉద్యమకారులను గుర్తించేందుకే కమిటీ ఏర్పాటు

31-05-2026 12:00 AM
  1. నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు
  2. ఉద్యమకారుల కమిటీ సభ్యులు,  ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి

ముషీరాబాద్, మే 30 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన  ఉద్యమకారులను గుర్తించేందుకే రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కమిటీని ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ, ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ ఎ. కోదండరాం అన్నారు. నిజమైన ఉద్యమకారులను గుర్తిం చి వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా అధ్యక్షతన ‘ఉద్యమకారుల  గుర్తింపు -సంక్షేమం’పై చర్చ గోష్టి కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ  ప్రొఫెసర్ కోదండరాం,  మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డిల తోపాటు పల్లె వినయ్, గంధం రాములు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, మేరీ మాదిగ తదితర  ఉద్యమకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండ రామ్ మాట్లాడుతూ గత  బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల నిరంకుశ పాలనలో ఉద్యమకారులను పట్టించుకోలేదని అన్నారు.

కమిటీ సభ్యులు రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ నిజమైన ఉద్యమకారులను గుర్తించి వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకే  కమిటీ వేసిందన్నారు. జూన్ 4వ తేదీన నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, ఆ సమావేశంలో ఉద్యమకారుల  అభిప్రాయాలను సేకరించి న్యాయం చేసే విధంగా కృషి చేస్తుందన్నారు. డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ  తెలంగాణ ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు 250  గజాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.  ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది ఉద్యమకారులు పాల్గొన్నారు.