18 April, 2026 | 3:10 AM

రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర

18-04-2026 01:43 AM
  1. ఇంద్రజాలికుడు ప్రధాని మోదీ
  2. కులగణనను పక్కదారి పట్టించేందుకే ౩ బిల్లులు
  3. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౭: భారతదేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ గొప్ప ఇంద్రజాలికుడని, పార్టీకి అవసరమైనప్పుడల్లా ఆయన ఇంద్రజాలం చేస్తారని, అలా వచ్చినవే బాలాకోట్ దాడులు, పెద్దనోట్ల రద్దు, ఆపరేషన్ సిందూర్ అంటూ విమర్శించారు. చివరకు ఈ ఇంద్రజాలికుడు దొరికిపోయాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మహిళా రిజర్వేషన్ కోసం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మరో రెండు బిల్లులపై లోక్‌సభలో శుక్రవారం రాహుల్‌గాంధీ ప్రసంగించారు. మూడు బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందవని కేంద్ర ప్రభుత్వానికి ముందే తెలుసని, అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీపై నెపం నెట్టేందుకే ఈ ప్రయత్నమని స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాల గొంతు నొక్కడం దేశ వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. 2023లో ఆమోదించిన మహిళా బిల్లే అసలైనదని ఆయన తెలిపారు.

ఇప్పుడు దానికి కొత్త నిబంధనలు చేర్చడం కేవలం రాజకీయ స్వార్థమేనని ఎద్దేవా చేశారు. కులగణనను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. వెనుక బడిన వర్గాలకు, దళితులకు, ఓబీసీలకు అధికారంలో సరైన భాగస్వామ్యం దక్కకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం రా జ్యాంగం కంటే మనువాదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు.

కులగణన డేటాను వచ్చే 15 ఏళ్ల వరకు ప్రాతి నిధ్యంతో సంబంధం లేకుండా చేయడమే కేంద్రమంత్రి అమిత్ షా వ్యూహమని ఆయ న పేర్కొన్నారు. తమ బలం తగ్గిపోతుందనే భయంతోనే బీజేపీ ఇలాంటి మార్పులు చేస్తోందని విమర్శించారు. ఓబీసీ వర్గానికి చెందిన సోదర సోదరీమణుల నుంచి అధికారాన్ని దూరం చేసే కుట్రలను తాము అడ్డుకుంటామని స్పష్టంచేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

తనకు తాను మహిళా బంధు అని పేరు తెచ్చుకునేందుకు మోదీ ఓ ఇంద్రజాలికుడిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవాచేశారు. మోదీపై ఆయన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, కిరణ్ రిజుజు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ వ్యాఖ్యలను సభా రికార్డుల నంచి వెంటనే తొలగించాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. మోదీపై అనుచిత వ్యాఖ్యలను రాహుల్ ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. ఇంద్రజాలికుడు అనే పదాన్ని పదేపదే వాడటం దేశ ప్రజలందరినీ అవమానించడమేనని పేర్కొన్నారు.

దీంతో స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకున్నారు. సభ్యులు హుందాగా వ్యవహరించాలని, చర్చ నుంచి సభ్యులు పక్కకు వెళ్లవద్దని సూచించారు. సభలో గందరగోళం తర్వాత, రాహుల్ గాంధీ తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రధానికీ తనకూ భార్యల నుంచి సలహాలు పొందే అవకాశం లేకపోయినా, తల్లులు, సోదరీమణుల నుంచి ఎంతో నేర్చుకుంటామని వివరించారు. ఈ వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి.