10 May, 2026 | 3:50 AM

కాంగ్రెస్ విభజన కుట్ర!

14-03-2025 01:24 AM
  1. దేశ సమైక్యతకు భంగం కలిగించే ప్రయత్నం 
  2. రేవంత్‌రెడ్డి, స్టాలిన్ తీరుపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి
  3. అసమర్థపాలనను కప్పిపుచ్చుకునేందుకే అఖిలపక్ష సమావేశం
  4.  బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కే లక్ష్మణ్

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కుట్ర పన్నుతోందంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కే లక్ష్మణ్ తెలిపారు. దక్షిణాది, ఉత్తరాది అని విభజించాలనే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదని ఆరోపించారు.

దేశ సమైక్యత, సమగ్రతకు భంగం కలిగేలా కాంగ్రెస్ పార్టీ, వారి సీఎంలు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. దక్షిణాదిలో ఒక్క సీటు కూడా తగ్గదని ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టంగా చెప్పినా ఇలాంటి వ్యాఖ్యలు తగవని లక్ష్మణ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దురాలోచనతో తమిళనాడు సీఎం స్టాలిన్ సీట్లు తగ్గుతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణలోనూ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి, అసహనం, ఆగ్రహం పెరిగిందని.. దానిని కప్పిపుచ్చుకునేందుకు, పదవీకాలం వెళ్లదీసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రచారం కూడా స్టాలిన్ లాంటిదేనన్నారు.

2026లో రాజ్యాంగ సవరణ తర్వాత చట్టం రూపొందుతుందని, కేంద్రం ఇప్పటివరకు పునర్విభజనపై ఎలాంటి ప్రకటన కానీ విధి విధానాలను రూపొందించలేదనేది చెప్పారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతుందనే విషయాన్ని స్టాలిన్, రేవంత్‌రెడ్డి గమనించాలని కోరారు. పార్లమెంటులో విధి విధానాలు రూపొందిస్తున్న సమయంలో తమ అభిప్రాయాలను చెప్పవచ్చని సూచించారు. 

దురుద్దేశంతోనే అఖిలపక్ష సమావేశం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పడం కాంగ్రెస్ పార్టీ దురుద్దేశాన్ని తెలియజేస్తోందని లక్ష్మణ్ ఆక్షేపించారు. డిఫ్యూటీ సీఎం భట్టి, జానారెడ్డి నాయకత్వంలో ఏర్పాటు చేసేది ప్రభుత్వ కమిటీనా.. లేక కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న కమిటీనా అనేది రేవంత్‌రెడ్డి తేల్చాల న్నారు.

స్టాలిన్ అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం అందుకున్న రేవంత్‌రెడ్డి.. ఆయన ఏర్పాటు చేసిన సమావేశాన్ని అభినందిస్తున్నట్లు మాట్లాడటం చూస్తే దక్షిణాది రాష్ట్రాల హక్కుల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయ త్నం చేస్తున్నారని అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి, మిత్రపక్షాల సీఎం స్టాలిన్ వ్యవహారంపై రాహుల్‌గాంధీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.