27-10-2025 07:32:58 PM
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి..
జడ్చర్ల: రైతులకు సౌకర్యవంతంగా మక్కల కొనుగోలు మార్కెట్ ప్రారంభించుకోవడం జరిగిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. మండలంలోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో గంగాపురం కొత్త మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని, రైతులు తమ పంటలకు సరైన ధర పొందే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
మక్కల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించామని చెప్పారు. రైతులు మార్కెట్ ధరలపై అవగాహన కలిగి, పిఎసిఎస్ ద్వారా నేరుగా అమ్మకాలు నిర్వహించుకోవడం వల్ల మధ్యవర్తుల దోపిడీకి అవకాశం ఉండదని అన్నారు. పంటల సేకరణ కేంద్రాల ఏర్పాటు ద్వారా రైతులకు సౌకర్యవంతమైన వాతావరణం అందుతుందని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సమాఖ్య ప్రతినిధులు, పిఎసిఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.