16 June, 2026 | 2:53 AM

చితికిపోతున్న మానవత్వం

16-06-2024 12:44 AM
  • మంటగలుస్తున్న బంధాలు

వివాహేతర సంబంధాలతో అకృత్యాలు

భార్యభర్తల మధ్య అను‘మానపు’ తగాదాలు

హత్యలకు దారితీస్తున్న పెడధోరణులు

రోజురోజుకు పెరుగుతున్న నేరాలు

మానవత్వం మంటగలుస్తోంది. మానవ సంబంధాలు రోజురోజుకు చితికిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు భార్యభర్తల బంధాన్ని అపహాస్యం చేస్తున్నాయి. 

ఏడగుడుగుల అనుబంధాలను  అను‘మానపు’ మంటలు దహించివేస్తున్నాయి. 

తెలంగాణలో తరచూగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలు సమాజాన్ని ప్రభావితం చేసేలా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం చోటుచేసుకున్న పలు సంఘటనలు 

అమానవీయతకు అద్దం పడుతున్నాయి. అనుమానంతో భార్యను హత్య చేయడం, పెళ్లి సంప్రదాయాన్ని ఎగ‘తాళి’ చేస్తోంది. వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకునే కడతేర్చడం పేగు బంధానికే ‘మాన’ని మచ్చ తెస్తోంది. క్షణికమైన సుఖం కోసం భర్తను కడతేర్చడం, కొడుకు వయస్సుగల వాడితో వివాహిత ఉడాయించడం సభ్య సమాజానికి తలవొంపులు తెచ్చిపెడుతోంది. 

ఆదిలాబాద్, జూన్15 : భార్యపై అనుమానంతో ఆమెను భర్త చంపేసిన ఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం..  పట్టణంలోని కురిద్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ ఖలీల్ ఖాన్ అదే కాలనీకి చెందిన  భారతీ అలియాస్ సల్మా(35)ని పదేళ్ల క్రితం మతాంతర వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఖలీల్‌కు పెళ్లయింది. సల్మాను పెళ్లి చేసుకోవడంతో మొదటి భార్య పుట్టింటింకి వెళ్లిపోయింది. 

ఇక కొన్ని రోజుల నుంచి సల్మాపై ఖలీల్‌కు అనుమానం కలిగింది. ఆమెతో తరచూ గొడవపడేవాడు. ఈ నెల 12న కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన ఖలీల్.. ఇంటి పక్కన ఇద్దరు పరిగెడుతుండడాన్ని గమనించి.. సల్మాను నిలదీ శాడు. ఆవేశంతో టేబుల్ చెక్కతో కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని తన ఆటోలోనే  రోడ్డు పక్కన పడేశాడు. మరుసటిరోజు మున్సిపల్ కార్మికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ముందుగా గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరకు ఆమెను ఖలీల్ హత్య చేసినట్లు నిర్ధారించారు.  నిందితుడిని అరెస్ట్ చేసి ఆటో, సెల్‌ఫోన్లు సీజ్ చేసినట్లు డీఎస్పీ జీవన్‌రెడ్డి మీడియాకు వివరించారు.  

ప్రియుడి మోజులో ...

ఆదిలాబాద్, జూన్15 : ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి భార్య హత్య చేయించిన ఉదంతం ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నార్నూర్ మండలం నగల్ కొండ గ్రామానికి చెందిన గజేందర్ జైనథ్ మేడిగూడ పాఠశాలలో తెలుగు పండిట్‌గా పనిచేస్తున్నాడు. గజేందర్ భార్య విజయలక్ష్మికి మరో వ్యక్తి మహేశ్‌తో వివాహే తర సంబంధం ఉంది. వీరిద్దరి ఆనందానికి గజేందర్ అడ్డుగా ఉన్నాడని భావించిన విజయలక్ష్మి భర్తను అడ్డు తొలగించుకోవాల నుకుంది. మహేశ్‌తో కలిసి స్కెచ్ వేసింది. బేల పెట్రోల్‌బంక్‌లో పని చేస్తున్న సుశీల్, కృష్ణను హత్య చేసేందుకు పురమాయించింది. ఆరు లక్షల సుపారీ కుదుర్చుకుంది. ఈ నెల 12న గజేందర్ పాఠశాలకు వెళ్తుండగా చంపాలని ప్లాన్ వేసుకున్నారు. 

ఆ రోజు 8గంటలకు పాఠశాలకు బయలుదేరిన గజేందర్‌ను లోకారి అటవీ సమీపంలో కాసుకుని ఉన్నమహేష్, హంతకులు సుశీల్,  కృష్ణ    ఆయన దిచక్ర వాహనాన్ని ఢీ కొట్టి కింద పడగొట్టారు. ప్లాన్ ప్రకారం అతడిని ఒక కిలోమీటర్ లోపలికి తీసుకెళ్లారు. ముఖం, ఇతర శరీర భాగాలపై బండరాళ్లతో బలంగా కొట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్య విజయలక్ష్మి, మహేష్ సెల్‌ఫోన్లలో జరిపిన సంభాషణల ఆధారంగా భార్యనే హత్య చేయించిందని నిర్ధారించారు.  విజయలక్ష్మితోపాటు ప్రియు డు మహేష్, హంతకులు సుశీల్, కృష్ణను అరెస్టు చేసి కటాకటాల్లోకి పంపించారు.