చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తే తప్పేంది?
- ముస్లింల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తోంది
- మెట్రోను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారనేది అసత్య ప్రచారం
- కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్
- ఆర్‌ఎంపీ డాక్టర్లతో ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్న కేంద్ర మంత్రి
మానకొండూరు, జూన్ 16(విజయక్రాంతి): విదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తే తప్పేముందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. విదేశీ ముస్లింలతో ఈ దేశ ముస్లింలను ఎందుకు పోలుస్తున్నారని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. మతాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకే ‘సర్’ ను వ్యతిరేకిస్తోందన్నారు. వాస్తవానికి ఈ దేశ పౌరుల ఓట్లను తొలగించే హక్కు ఏ ఒక్కరికీ లేదని స్పష్టం చేశారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా విదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగించాలా? వద్దా? అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెట్రో రెండో దశను అడ్డుకుంటున్నారని సీఎం చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు.
మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కేంద్ర విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వివిధ వర్గాలతో నేతలను కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్న బండి సంజయ్ కుమార్ అందులో భాగంగా కరీంనగర్ జిల్లా, మండల కేంద్రమైన మానకొండూరులో మంగళవారం ఆర్‌ఎంపీ డాక్టర్లతో ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమానికి హాజరై ,మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
కిషన్‌రెడ్డి అడ్డుకోవాలని అనుకుంటే తెలంగాణకు ఇంత పెద్ద ఎత్తున నిధులు, ప్రాజెక్టులు ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలని ప్రజలను కోరారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, బీజేపీకి కాంగ్రెస్ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు సైతం మోదీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులిస్తోందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో మావోయిస్టు భావజాలం ఉన్న నేతలు ఉన్నారని కవిత చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని స్పష్టం చేశారు.
దేశ చరిత్రలో 4,400 కు పైగా రోజులు ప్రధానిగా ఉన్న ఘనత నరేంద్రమోదీకే దక్కిందన్నారు.12 ఏళ్లలో 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులనుకేంద్రం తెలంగాణకు కేటాయించిందన్నారు. తెలంగాణ లోనూ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి, లేని పక్షంలో కేంద్ర నిధులు, కేంద్ర సంక్షేమ పథకాలు సైతం దారి మళ్లే ప్రమాదం ఉందని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఇచ్చారు అధికారం... ఒక్కసారి బీజేపీకి ఇవ్వండి అవకాశం అని ఆయన ప్రజలను కోరారు.






