25 June, 2026 | 1:30 AM

ట్రంప్ ఇంటరచ్చ!

25-06-2026 12:00 AM

మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ రెండోసారి గద్దెనెక్కిన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం విషయంలో ఆయనకు ఇంటిపోరు తప్పడం లేదు. చట్టసభల అనుమతి లేకుండా సైనిక చర్యలు చేపట్టకూడదని అమెరికా సెనేట్ తీర్మానం చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే, అమెరికా సెనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో నలుగురు అధికార రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు కూడా ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

అగ్రరాజ్యం చట్టసభలో నెలకొన్న ఈ విభేదాలు అధ్యక్షుడికి పూర్తిస్థాయి మద్దతు లేదనే సంకేతాన్ని ఇస్తున్నాయి. ఈ పరిణామాలు ట్రంప్ సర్కార్ విదేశాంగ విధానానికి మాత్రమే కాదు..  ట్రంప్ నాయకత్వం, అధ్యక్షుడి నిర్ణయాల పట్ల అమెరికాలో పెరుగుతున్న సందేహాలను కూడా ప్రతిబింబిస్తున్నాయని చెప్పక తప్పదు. ఈ పరిణామాలను పశ్చియాసియా యుద్ధానికే పరిమితం చేసి చూడలేం. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత  ట్రంప్ అనుసరిస్తున్న కఠిన ఆర్థిక, వలస విధానాలు ఇప్పటికే దేశీయంగా, అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి.

దిగుమతులపై భారీ సుంకాలు విధించడం, వీసా నిబంధనలను కఠినతరం చేయడం లాంటి చర్యల కారణంగా మిత్రదేశాలు కూడా అమెరికాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. యూరప్ సహా అనేక దేశాల్లో అమెరికా విధానాల పట్ల వ్యతిరేకత పెరుగుతుండటం మిత్రదేశాల అసంతృప్తికి తార్కాణంగా నిలుస్తున్న ది. అయితే ఈ పరిస్థితిని ట్రంప్ రాజకీయ పతనంగా భావించడం కూడా తొందరపాటే అవుతుంది. ఇప్పటికీ అధికార పార్టీ ప్రధాన వర్గాల్లో ఆయనకు గణనీయమైన మద్దతు ఉంది.

సరిహద్దు భద్రత, దేశీయ పరిశ్రమల పరిరక్షణ, జాతీయ ప్రయోజనాలు, స్థానికులకు పెద్దపీట లాంటి అంశాల్లో ట్రంప్ విధానాలను సమర్థించే వర్గాలు బలంగానే ఉన్నాయి. అందువల్ల ప్రస్తుత వ్యతిరేకతను తిరుగుబాటుగా కాకుండా, కొన్ని విధానాలపై వ్యక్తమవుతున్న అసమ్మతిగానే చూడాలి.

మొత్తంగా చూస్తే, ఇరాన్ యుద్ధం విషయంలో సెనేట్ చేసిన తీర్మానం అమెరికా అధ్యక్షుడికి ఓ రాజకీయ హెచ్చరిక అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ, మిత్రదేశాలతో సంబంధాలు దెబ్బతినడం వల్ల భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలపై అమెరికా ప్రభావం గణనీయంగా తగ్గే ప్రమాదం పొంచి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.