3 April, 2026 | 1:25 AM

నిర్వహణ కరువు.. పల్లె ప్రగతి బరువు!

03-04-2026 12:00 AM
  1. నాడు కళకళ నేడు విలవిల..
  2. కళ తప్పిన ప్రకృతి వనాలు
  3. నిరుపయోగంగా ఓపెన్ జిమ్, క్రీడా ప్రాంగణాలు
  4. నంగునూరు మండలంలో అస్తవ్యస్తంగా నిర్వహణ

నంగునూరు, ఏప్రిల్ 2: గ్రామాల ముఖచిత్రాన్ని మార్చాలని, పల్లెల్లో పచ్చదనం పరిమళించడంతో పాటు యువతకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయంలో లక్షలాది రూపాయలతో నిర్మించిన ’పల్లె ప్రగతి’ ఆస్తులు నేడు నిరాదరణకు గురవుతున్నాయి.

నంగునూరు మండల వ్యాప్తంగా ఉన్న పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్లు కొన్ని గ్రామాలు మినయహిం చి పర్యవేక్షణ లేక వెలవెలబోతున్నాయి. నాడు పచ్చని మొక్కలతో కళకళలాడిన వనా లు, నేడు ఎండిపోయిన కొమ్మలతో, పిచ్చిమొక్కల పొదలతో అరణ్య రోదన చేస్తున్నాయి.

అడవిగా మారిన ప్రకృతి వనాలు

తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటి ‘మినీ అడవుల’ను సృష్టించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు నేడు పిచ్చిమొక్కలకు నిలయాలుగా మారాయి. నంగునూరు మండలం అక్కెనపల్లిఆరేపల్లి సరిహద్దుల్లోని వనంతో పాటు, మండలంలోని చాలా గ్రామ పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.మొక్కలకు నీరు పోసే నాథుడే కరువవ్వడంతో పచ్చదనం మృగ్యమైంది. కొన్నిచోట్ల రక్షణ కంచెలు విరిగిపో వడంతో పశువులు,మేకల సంచారం పెరిగి మొక్కలు పూర్తిగా నాశనమవుతున్నాయి.

తుప్పు పడుతున్న వ్యాయామ పరికరాలు

గ్రామీణ యువత శారీరక దృఢత్వం కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వ్యాయామ పరికరాలు ఎండకు ఎండి, వానకు తడిసి తుప్పు పడుతున్నాయి. కొన్ని చోట్ల ఈ పరికరాలు విరిగిపోయి ప్రమాదకరంగా మారాయి. వ్యాయామం చేయాల్సిన యువత పక్కకు పోవడంతో, ఈ ప్రాంతాలు సాయంత్రం వేళ అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వృథాగా ప్రజాధనం

యువత ఉత్సాహంగా ఆడుకోవాల్సిన క్రీడా ప్రాంగణాలు ఇప్పుడు పశువుల మేత మైదానాలుగా దర్శనమిస్తున్నాయి.క్రీడాకారుల కోసం సిద్ధం చేసిన ట్రాకులు పిచ్చిగడ్డి తో నిండిపోయాయి. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టులను చేపట్టినప్పటికీ, ప్రస్తుత పాలనలో వీటి నిర్వహణను గాలికొదిలేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీలకు ఉన్న ట్రాక్టర్లు, నీటి ట్యాంకర్లను మొక్కల సంరక్షణకు వినియోగించ డంలో అధికారులు వైఫల్యం చెందారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పర్యవేక్షణ ఏది? 

కేవలం నిర్మాణాలు చేసి వదిలేయడమే కాకుండా,వాటిని నిరంతరం పర్యవేక్షించే బాధ్యతను స్థానిక కమిటీలకు లేదా ఉపాధి హామీ పథకం కింద కేటాయించాల్సిన అవసరం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి,నంగునూరు మండలంలోని ఈ ఆస్తులను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామీణులు విజ్ఞప్తి చేస్తున్నారు.