మృతదేహం లభ్యం
జహీరాబాద్, మార్చి 11: జహీరాబాద్ నియోజకవర్గంలోని బూచనెల్లి గ్రామ శివారులో కుళ్ళిపోయిన పురుషుని మృతదేహం లభ్యమైనట్లు చిరాగ్ పల్లి ఎస్‌ఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం బూచినేని గ్రామానికి చెందిన మాణిక్ తన పొలంలో చెరుకు పంటకు నీరును వదిలేందుకు వెళ్లగా కుళ్లిపోయిన శవం కనబడడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిందని, దాదాపు పది రోజుల క్రితం మరణించి ఉండవచ్చని తెలిపారు.
మరణించిన వ్యక్తి వయస్సు దాదాపు 35 నుండి 40 సంవత్సరాల వయసు కలిగి ఉంటాడని, ఒంటిపై బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ మెరూన్ కలర్ అండర్వేర్ ఉందని, నడుముకు ఎర్రని మొలతాడు ఉందని తెలిపారు. నడుము నుండి తలవరకు చర్మం పూర్తిగా ఊడిపోయి ఎముకలు కనిపిస్తున్నాయన్నారు. రైతు మాణిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పైన తెలిపిన ఆధారాల ప్రకారం మృతుని గుర్తించిన వారు తెలిస్తే చిరాకుపల్లి పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఎస్.ఐ తెలిపారు.




