డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యం కావాలి!
- మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పాటలు, నాటికలు రూపొందించండి
- మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
- యువతకు, యూట్యూబర్లకు పిలుపు
న్యూఢిల్లీ, ఆగస్టు 30: మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి, యువతకు బలమైన భవిష్యత్తును నిర్మించడానికి పౌరులందరూ చేతులు కలపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ బానిసత్వం కేవలం వ్యక్తిని మాత్రమే కాకుండా, మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
యువ సంగీతకారులు, విద్యార్థులు, నాటక బృందాలు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేలా పాటలు, లఘు నాటికలు వంటి సృజనాత్మక కంటెంట్ రూపొందించాలని యువతకు, యూట్యూబర్లను కోరారు. ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేయాలని పేర్కొన్నారు. ఆదివారం తన నెలవారీ రేడియో ప్రసంగమైన 137వ ‘మన్ కీ బాత్’లో మోదీ మాట్లాడారు.
‘అభివృద్ధి చెందిన భారత దేశం కోసం మాదకద్రవ్య రహిత యువత’ ప్రచారం దేశవ్యాప్తంగా ఊపందుకుంటోందని స్పష్టం చేశారు. మాదక ద్రవ్య రహిత యువత, మాదకద్రవ్య రహిత భారతదేశమే దీని లక్ష్యమని పేర్కొన్నారు. మాదకద్రవ్య రహిత భారతదేశాన్ని, మన యువతకు బలమైన భవిష్యత్తును నిర్మించడానికి మనమందరం ఏకమవుదాం అని స్పష్టం చేశారు. ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ (ఎన్‌ఎంబీఏ) ద్వారా మాదకద్రవ్య రహిత భారతదేశ సాధన కార్యక్రమాన్ని మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్‌ఏఊడడీఆర్) కింద 2020 ఆగస్టు 15న ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ కార్యక్రమం మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రోత్సహించా లన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అవగాహన కల్పించాలని కంటెంట్ క్రియేటర్లకు, యూట్యూబ్‌కు సూచించారు. కంటెం ట్ క్రియేటర్లు భారత్‌లోని వివిధ బాషలలో అవగాహన వీడియోలను తయారు చేయాలని, ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వీధి వ్యాపారుల సంక్షేమ పథకమైన పీఎం స్వనిధి యోజనను ప్రస్తావిస్తూ, ఈ పథకం లక్షలాది మంది మహిళా వీధి వ్యాపారులకు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి, ఆదాయాలను పెంచుకోవడానికి, వారి కుటుంబాలకు మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి సహాయపడుతోందని ప్రధానమంత్రి అన్నారు.
‘పీఎం స్వనిధి పథకం’ ద్వారా లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు కొత్త బలాన్ని పొందుతున్నారని, అయితే ’మహిళా సాధికారత’కు సంబంధించిన ఈ అంశంపై జరగాల్సినంత చర్చ జరగడం లేదని ప్రధాని తెలిపారు. ’పీఎం స్వనిధి పథకం’ లబ్ధిదారులలో దాదాపు 46 శాతం మంది మహిళలే ఉన్నారు. అంటే, దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి ఈ పథకంతో అనుసంధానం అవుతున్నారని పేర్కొన్నారు.






