దుమ్మురేపిన మ్యూజికల్ నైట్!
- మార్మోగిన తెలంగాణ యాస.. భాష
- ఉర్రూతలూగించిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్
- సినీ తారలు, రాజకీయ ప్రముఖులతో కళకళ
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ప్రజాపాలన విజయయోత్సవాల్లో భాగంగా హుస్సేన్ సాగర్ తీరంలోని హెచ్‌ఎంఈడీ గ్రౌండ్ వేదికగా ఆదివారం రాత్రి సర్కార్ నిర్వహించిన మ్యూజికల్ నైట్ హోరెత్తింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గళం నుంచి వచ్చిన పాటలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
‘నువ్వు పెద్దపులి.. నువ్వ పెద్దపులి లెక్క గొడ్తివిరో.. బెమ్మాండం బద్దలు గొట్టెయ్రో..’ పాట దుమ్ము రేపింది. తెలంగాణ యాస.. భాషతో ప్రాంగణం మార్మోగింది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, స్పీకర్ గడ్డ ప్రసాద్‌కుమార్ చప్పుట్లు కొడుతూ మ్యూజికల్ నైట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రేక్షకుల కేరింతలు, కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. అలాగే ఫుట్‌ఓవర్ బ్రిడ్జి వద్ద జానపద గాయకులు పల్లె బాణీలు వినిపించారు. అమరజ్యోతి నుంచి ఐమాక్స్ వరకు వివిధ ప్రభుత్వశాఖలు, సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ ఎదుట కళాకారుల సంప్రదాయ కళలు, ఎన్టీఆర్ పార్క్ ఎదుట ప్రదర్శనలు కనువిందు చేశాయి.
స్టాళ్లను సందర్శించిన సీఎం..
సచివాలయం ఎదుట ప్రముఖ హోటళ్లు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, ఇతర ప్రజాప్రతినిధులు సందర్శించారు.
అనంతరం వారు హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో మ్యూజికల్ నైట్‌ను తిలకించారు. ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన చేనేత, ఫుడ్ స్టాళ్లను సినీతారలు అంజలి, మీనాక్షిచౌదరి, ఇతర యాక్టర్లు సందర్శించారు.






