25 April, 2026 | 1:38 AM

మీసేవా యాప్‌లో పౌరసేవలు

09-12-2024 02:14 AM
  1. అందుబాటులోకి 230 సేవలు
  2. మీసేవా ద్వారా మరిన్ని సర్టిఫికెట్ల జారీ
  3. కొత్తగా సెల్ఫ్ ఆపరేటింగ్ మీసేవా ‘కియోస్క్’ ఆవిష్కరణ

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): మీసేవా కేంద్రాల ద్వారా ప్రజలు అందుకుంటున్న సేవలను మరింత సులభతరం, వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఇందులో భాగంగా కొత్త మీసేవా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మీసేవా మొబైల్ యాప్‌ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. ఈ మీసేవా మొబైల్ యాప్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడ నుంచైనా సేవలు పొందవచ్చు. ఈ యాప్‌లో గవర్నమెంట్ టూ సిటిజెన్ (జీటూసీ), బిజినెస్ టూ సిటిజెన్(బీటూసీ), వాల్యూ యాడెడ్ సర్వీసెస్ వంటి 230 అత్యవసర సేవలు వినియోగదారులకు ఆన్‌లైన్‌లోనే లభిస్తాయి.

తెలంగాణ వాసులెవరైనా ఈ యాప్ ద్వారా ప్రత్యక్షంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా పౌరసేవలు పొందే అవకాశం ఉంటుంది. లెర్నర్స్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, డ్యూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, రెన్యూవల్స్ వంటి రవాణా శాఖకు సంబంధించిన సేవలు, మ్యారేజ్ సర్టిఫికెట్లు, సేల్ ఆఫ్ స్టాంప్స్, మార్కెట్ వాల్యూ వంటి రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సేవలకు కూడా లభించనున్నాయి. యుటిలిటీ బిల్లులు, విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు కూడా ఈ మీసేవా మొబైల్ యాప్ సహకరిస్తుంది. 

కొత్తగా జారీ చేసే సర్టిఫికెట్లు 

మీసేవా కేంద్రాల ద్వారా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత విస్తరించింది. ఇప్పటివరకు మీసేవా పొందని కొన్ని శాఖలకు సంబంధించిన సర్టిఫికెట్లను ఇకపై మీసేవా కేంద్రాల్లో లభించనున్నాయి. గతంలో అందిస్తున్న వాటితోపాటు రెవెన్యూ శాఖ నుంచి పొందే గ్యాప్ సర్టిఫికెట్, పేరు సవరణ సర్టిఫికెట్, స్థానికత సర్టిఫికెట్, మైనార్టీ సర్టిఫికెట్, ఆదాయ, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్, క్రిమీలేయర్, నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్లు, అటవీ శాఖ నుంచి పొందే అడవి జంతువుల దాడిలో మృతి చెందినట్టు ధ్రువీకరణ సర్టిఫికెట్, టింబర్ డిపో రెన్యూవల్ సర్టిఫికెట్ల వంటివి ఇకపై మీసేవా కేంద్రాల ద్వారా జారీ కానున్నాయి. 

‘కియోస్క్’తో స్వయం సేవలు 

పౌర సేవలను మరింత పారదర్శకంగా, మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ‘కియోస్క్’ అనే పరికరాన్ని రూపొందించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కియోస్క్ ద్వారా మీసేవాలో లభించే సేవలను స్వయంగా పొందవచ్చు. రాష్ట్రంలోని ఆయా ప్రజా సేవా కేంద్రాల వద్ద ఈ కియోస్క్ పరికరాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని సాంకేతికరణ ప్రక్రియలో ఇదొక మైలురాయిలా నిలువనున్నది.

కియోస్క్‌లో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వినియోగం ద్వారా సమర్థంగా, సమయాభావం లేకుండా వినియోగదారులకు సేవలు అందుతాయి. కియోస్క్‌లో డాక్యుమెంట్ స్కానింగ్, ప్రింటింగ్‌కు కూడా అవకాశం ఉంటుంది. సేవల్లో అంతరాయం కలుగకుండా పవర్ బ్యాకప్ అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రజలకు అందించే సేవల్లో ప్రభుత్వం చూపుతున్న పారదర్శకతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.