జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ అమలు చేయాలి
జిల్లా కలెక్టర్‌కు డీఎంఏసీ సభ్యుడు ఎండీ యాకూబ్ పాషా విజ్ఞప్తి
పాల్వంచ, (విజయక్రాంతి): జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన 50 శాతం ఫీజు రాయితీని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్, డీఎంఏసీ చైర్మన్‌ను జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు ఎండీ యాకూబ్ పాషా కోరారు.
ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్‌కు ఆయన వినతిపత్రం సమర్పించారు. Rc.No: Spl/A7/Pvt-Schools/2026-27, తేదీ 16-06-2026 ద్వారా జిల్లా విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాల్సి ఉందని తెలిపారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని యాకూబ్ పాషా పేర్కొన్నారు. సమాచార వ్యాప్తితో పాటు ప్రజల్లో చైతన్యం పెంపొందించడంలో జర్నలిస్టుల సేవలు ఎంతో ముఖ్యమైనవన్నారు. అయితే జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు రాయితీని అమలు చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు.పుస్తకాలు, ఇతర విద్యా ఖర్చులతో జర్నలిస్టు కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం కల్పించిన 50 శాతం ఫీజు రాయితీ వారికి గణనీయమైన ఆర్థిక ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.
జిల్లా పరిధిలోని అన్ని సంబంధిత ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, ఎయిడెడ్ పాఠశాలలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీని ఏకరీతిగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను యాకూబ్ పాషా కోరారు.ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలయ్యేలా సంబంధిత విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని, అర్హులైన జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వం ఉద్దేశించిన సంక్షేమ ప్రయోజనం అందేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






