ఇవేం పనులు టీచర్?
విద్యార్థులతో వ్యక్తిగత పనులు..
కేసముద్రం, ఆగస్టు 13 (విజయక్రాంతి): పేద పిల్లలకు చక్కగా విద్యా బోధన చేసి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు.. వారిని పని మనుషుల కంటే హీనంగా చూస్తూ.. వ్యక్తిగత పనులు చేయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం ఇంచార్జ్ స్పెషల్ ఆఫీసర్ అర్చన హాస్టల్ లో విద్యార్థులకు విద్యాబోధన చేయడం పక్కనపెట్టి..
వారి చేత తలకు నూనె రాయించుకొని చక్కగా.. జడ వేయించుకుంటున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఈ దృశ్యాలను చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు టీచర్ వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకొని వెంటనే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.






