16 May, 2026 | 3:00 AM

అక్కినేని నటనకు, దాసరి ప్రతిభకు పూలాభిషేకం!

18-02-2025 12:00 AM

‘నా కళ్లు చెబుతున్నాయి.. నిను ప్రేమించానని..’, ‘ఆగదు ఏ నిముషము నీ కోసమూ.. ఆగితే సాగదు ఈ లోకమూ..’, ‘కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా..’, ‘వందనం అభివందనం.. నీ అందమే ఒక నందనం..’ అంటూ సాగే ఈ పల్లవులు కాదు కాదు.. ఈ పాటలన్నీ ఈమధ్యే ఎక్కడో విన్నట్టు అనిపిస్తోంది కదూ! ఔను, పాటలను, గీత సాహిత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సాంగ్స్ అలాంటి అనుభూతినే కలిగిస్తాయి.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీ సుశీల తదితరులు పాడిన ఈ పాటలు 80ల నాటి సంచలన చిత్రం ‘ప్రేమాభిషేకం’లోనివి!! ఈ సినిమాలోని పాటలన్నీ దాసరి నారాయణరావు కలం నుంచి జాలువారిన జావళీలు. ఇందులోని పాటలే కాదు.. ఈ సినిమా నెలకొల్పిన రికార్డులూ సంచలనమే! 1981, ఫిబ్రవరి 18న విడుదలైందీ చిత్రం.

అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ నాయకానాయికలుగా నటించగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంలో అలనాటి దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు తెరకెక్కించారు. సంగీత సంచలనం కే చక్రవర్తి సంగీత సారథ్యం వహించారు. తెలుగు సినీ చరిత్రలో రూ.4 కోట్ల పైన షేర్ వసూల్ చేసిన మొదటి చిత్రం ఇదే కావటం విశేషం.

ఈ సినిమాకు మొత్తం 4.5 కోట్ల షేర్ వచ్చింది. తెలుగు సినిమా రంగంలో మొట్టమొదటి ప్లాటినం జూబ్లీ సినిమా, 75 వారాలు ఆడిన తొలి చిత్రం ఇదే. 8 కేంద్రాల్లో ఏడాదిపాటు ఆడిన ఒకే ఒక్క సినిమాగా రికార్డుకెక్కింది. అంత గొప్పగా ప్రేక్షకాదరణ పొందింది కాబట్టే.. ‘అక్కినేని నటనకు, దాసరి ప్రతిభకు పూలాభిషేకం’ అంటూ సగర్వంగా పోస్టర్లు వేసిందీ చిత్రబృందం.