లక్ష్యాన్ని గుర్తుచేసే డ్రాగన్
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లు. కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేశ్, కల్పాతి ఎస్ సురేశ్ నిర్మించారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 21న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.
దర్శకులు హరీశ్‌శంకర్, సాయిరాజేశ్, కిషోర్ తిరుమల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. ‘తెలుగులో ప్రదీప్ రంగనాథన్ అద్భుతంగా మాట్లాడారు. ఒకసారి హీరోను మనం సొంతం చేసుకుంటే.. ఆ హీరో ఏం చేసినా మనకు నచ్చేస్తుంది. ప్రదీప్ ఇప్పుడు అలాంటి ఇమేజ్‌ను ఇక్కడ సొంతం చేసుకున్నారు.
ఈ చిత్రాన్ని నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను’ అన్నారు. హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. “లవ్‌టుడే’ టైమ్‌లో ఇక్కడకు వచ్చినప్పుడు నెక్ట్స్ టైమ్ తెలుగులోనే మాట్లాడతానని మాటి చ్చా. మాటిస్తే చేస్తామా? లేదా? అనేదానికంటే.. అసలు ప్రయత్నించామా? లేదా? అన్నదే ముఖ్యం. అదే మా డ్రాగన్ చిత్రం. ఓ మామూలు అబ్బాయి జీవితంలో ముందు కెళ్లాలని చేసే ప్రయత్నమే మా ‘డ్రాగన్’.
ప్రతీ ఒక్కరం ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. అలా ప్రయత్నించే ప్రతిఒక్కరి గుండెల్లో మా ‘డ్రాగన్’ నిలిచిపోతుంది. మనం ఏదైనా సరే ప్రయత్నిస్తూ వెళ్తూ ఉంటే.. ఏదో ఒకరోజు సాధిస్తాం. అశ్వత్ లాంటి ఓ ఫ్రెండ్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది.. మాది పదేళ్ల పరిచయం. మైత్రి బ్యానర్‌లో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది” అని తెలిపారు.
హీరోయిన్ కయాదు లోహార్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన సినిమా. ఇదే నా మొదటి తమిళ, తెలుగు సినిమా. యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా అన్నింట్లో ప్రదీప్ తన మార్క్ వేశారు’ అన్నారు. చిత్ర దర్శకుడు అశ్వత్ మాట్లాడుతూ.. ‘తెలుగు ఆడియెన్స్ నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు.. నువ్వు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు అని ప్రదీప్‌కు చెప్పాను. ఈరోజు ఆయన ఈవెంట్‌లో అద్భుతంగా మాట్లాడారు.
అలాంటి డెడికేషన్ ఉంది కాబట్టే ప్రదీప్ ఈ స్థాయికి వచ్చాడు. ఏజీఎస్.. నాకు హోం బ్యానర్. నెక్ట్స్ చిత్రాన్ని ఆ బ్యానర్‌లోనే చేస్తున్నాను. హరీశ్‌శంకర్ సినిమాలన్నీ నాకు ఇష్టం’ అని చెప్పారు. నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి తెలుగు వర్షెన్ డైలాగ్స్ రాసిన కృష్ణ నాకు ఆల్రెడీ కథ చెప్పేశారు. మూవీ అద్భుతంగా ఉండబో తోంది’ అని చెప్పారు. నిర్మాత అర్చన, నిర్మాత రవిశంకర్ పాల్గొన్నారు.






