జన్వాడ బడికి మహర్దశ..
- రూ.5 కోట్లతో కార్పొరేట్ రేంజ్ మోడల్ స్కూల్
- రాష్టంలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలో ఏఐ హ్యూమనాయిడ్ రోబో టీచర్లు
- విద్యార్థుల్లో నూతన ఉత్తేజం
రంగారెడ్డి/ శంకర్ పల్లి, అగస్టు 24(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ ప్రాథమికోన్నత పాఠశాల నూతన రూపురేఖలు దిద్దుకుని కా ర్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారైంది. గతంలో శిథిలావస్థకు చేరి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాత భవనం స్థానంలో రూ. 5 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో అధునాతన భవనాన్ని నిర్మించారు. 1600 చదరపు గజాల విస్తీర్ణంలో జి ప్లస్ 2 (G+2) అంతస్తుల్లో ఈ పాఠశాలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారు.
మోడల్ నిర్మాణం..
ప్రతి అంతస్తులో విద్యార్థి, విద్యార్థినులకు విడివిడిగా 4 యూనిట్లలో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. తరగతి గదులో విద్యార్థులకు అనుకూలమైన డెస్క్ టేబుళ్లు, మెరుగైన వెంటిలేషన్, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. పాఠశాల ఆవరణలోనే విద్యార్థులు ప్రార్థనలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు డిజైనర్ స్టేజీని నిర్మించారు.
తొలిసారి ఏఐ రోబో టీచర్లు..
తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా ఒక ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్, సాంకేతిక విద్యను ప్రవేశపెట్టారు. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ సౌజన్యంతో మూడు హ్యూమనాయిడ్ రోబో (ఏఐ) టీచర్లను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. ఈ రోబోలు సాధారణ ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు బోధన, మెంటరింగ్, నాయకత్వ నైపుణ్యాల శిక్షణ అందించనున్నాయి.
కేటీఆర్ చొరవ.. ఇండస్ సంస్థ దాతృత్వం..
పాఠశాల దీనస్థితిని స్థానిక బీఆర్‌ఎస్ నాయకుడు గౌడ్ చెర్ల వెంకటేష్, మాజీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. కేటీఆర్ పిలుపు మేరకు కొండకల్లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం ముందుకు వచ్చి కేవలం ఏడాది వ్యవధిలోనే ఈ మోడల్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పగించింది. త్వరలోనే జిల్లా పరిషత్ పాఠశాల భవనాన్ని కూడా నిర్మిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారని ఇటీవల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ..
పాఠశాల పూర్వ విద్యార్థి, సీనియర్ నాయకులు గౌడ్ చెర్ల వెంకటేష్, ప్రశాంత్ యాదవ్ తమ సొంత నిధులతో 9, 10 తరగతుల విద్యార్థుల రవాణా సౌకర్యార్థం 50 సైకిళ్లను ఉచితంగా అందజేశారు. దశాబ్దాల చరిత్ర కలిగిన తమ పాఠశాల అభివృద్ధి చెందడం పట్ల మాజీ ఎంపీటీసీ తలారి మైసయ్య, పూర్వ విద్యార్థులు మరియు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
* రాష్ట్రంలో ఎక్కడలేని వి ధంగా ఏఐ రో బోలతో విద్యా బోధనలు చేపట్టడం ఒక వి నూత్నమైన ప్రక్రియ. ఈ వినూతనమైన ప్రక్రియకు జన్వాడ పీఎంసి, జడ్.పి.హెచ్. ఎస్ పాఠశాలను ఎన్నుకోవడం ఒక విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయు నిగా మాకు ఎంతో గర్వ కారణము. దీని కి సహకరించి దాతలకు మా ప్రత్యేక కృతజ్ఞతలు-..
తిరుపతి రెడ్డి, భౌతిక రసాయన శాస్త్ర టీచర్
మా దోస్తులు మళ్లీ స్కూల్‌కు వస్తంటుర్రు..
మా స్కూల్ గతంలో పూర్తిగా శిథిలావస్థలో ఉండేది. కానీ ఇండస్ ఇంటర్నేషనల్ సంస్థ వారు స్కూల్ యాజమాన్యం అందించిన సహకారంతో కార్పొరేట్ పాఠశాలలా రూపుదిద్దుకుంది. ఒకప్పుడు ఇక్కడి నుండి వేరే పాఠశాలలకు వెళ్లిన నా స్నేహితులు కూడా ఇప్పుడు మళ్లీ మన బడికే వస్తామని చెబుతున్నారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పడిన ఇండస్ యాజమాన్యానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. బాగా చదువుకుని మా గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తెస్తామని మాటిస్తున్నాము.
శిరీష, 9వ తరగతి విద్యార్థిని
కేటీఆర్ అన్న సహకారంతో పాఠశాలకు మహర్దశ..
నేను ఇదే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థిని. గతంలో ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న దుస్థితిని, పాఠశాలలోని పలు సమస్యలను కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించి పూర్తి సహకారం అందించారు. ప్రస్తుతం పాఠశాల రూపురేఖలు మారి, విద్యార్థుల కళ్ళల్లో సంతోషకరమైన చిరునవ్వు కనిపిస్తోంది. బడి అభివృద్ధికి తోడ్పడిన కేటీఆర్ గారికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము.
వెంకటేష్, పూర్వ విద్యార్థి,






