సైన్స్ ప్రయోగాలతోనే విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందుతుంది
నూతనకల్,(విజయక్రాంతి): శాస్త్ర సాంకేతిక రంగాలలో విద్యార్థులు రాణించాలంటే చిన్నతనం నుండే సైన్స్ ప్రయోగాలపై ఆసక్తిని పెంచుకోవాలని, దీనివల్ల వారిలో సృజనాత్మకత మెరుగుపడుతుందని నూతనకల్ సర్పంచ్ మహేశ్వరం మల్లికార్జున్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని విజయ మేరీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వినూత్నమైన సైన్స్ ప్రాజెక్టులను మల్లికార్జున్ ఆసక్తిగా తిలకించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... 'మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా'గా పేరుపొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.పట్టుదల, క్రమశిక్షణతో కూడిన విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, భవిష్యత్తులో దేశ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగం సరిత సుధీర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత, ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, కిరణ్, గోపి, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.




