22 May, 2026 | 12:16 AM

యువతకు చేయూత

19-06-2024 12:34 AM
  • సర్టిఫికెట్‌తోపాటు సాంకేతికత ఉండాలి

65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ మల్లేపల్లిలోని ఐటీఐలో శంఖుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ఐటీఐల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): ప్రపంచంతో పోటీ పడా లంటే సర్టిఫికెట్‌తోపాటు సాంకేతికత అవసరమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం సర్టిఫికెట్స్ జీవన ప్రమాణాలను పెంచవని, సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. దుబాయ్ లాంటి దేశాలకు వలసలు వెళ్లకుండా తమ ప్రభుత్వం ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు.  సాంకేతిక నైపుణ్యం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎదురుచూడాల్సిన అవసరం లేదన్నారు.

65 ఐటీఐలను అడ్వా న్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ)లుగా అప్‌గ్రేడ్ చేస్తూ మల్లేపల్లి ఐటీఐలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఏటీసీ)గా మారుస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కీలకాంశాలుగా నాడు ఉద్యమం సాగిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందలేకపోయారన్నారు. తమ ప్రభు త్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని ఐటీఐ వివరాలను తెప్పించి వాటిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించామన్నారు. ఈ క్రమంలోనే వాటిని ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. 

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగులు తమ విలువైన సమయాన్ని టీఎస్‌పీఎస్‌సీ, మెడికల్ బోర్డు, ఇతర నియామక సంస్థల చుట్టూ తిరుగుతూ వృథా చేసుకున్నారని, ఇక మీదట అలా జరగనివ్వమని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచం వేగంగా అధునాతన టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుంటే, ఐటీఐల్లో మాత్రం ఇంకా 40 ఏళ్ల కిందటి నైపుణ్యాలను నేర్పిస్తున్నారని పేర్కొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా సిలబస్‌ను మార్చుకొని యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

నా ఆలోచనల నుంచి పుట్టిందే ఏటీసీ

ఎంతో మంది నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇంకా ఎదురుచూస్తున్నారని, నైపుణ్యత ఉంటే ఉద్యోగావకాశాలకు దారిచూపుతాయన్నారు. తనకు కూడా ఓ స్వీయ అనుభవం ఎదురైందని సీఎం వివరించారు. ‘నేను ఇల్లు కట్టుకునే సమయంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి రూ.15 వేలు, రూ.20 వేలకు పనిచేస్తామన్నారు. అదే మేస్త్రీలు, నిర్మాణ రంగంలో అనుభవం ఉన్నవారిని సంప్రదిస్తే రూ.60 వేలు అడిగారు. సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలు పెంచడంలేదని నాకు అప్పుడే అర్థమైంది’ అని చెప్పారు. అలా తన ఆలోచనల నుంచి పుట్టిందే ఈ ఏటీసీ సెంటర్లని సీఎం పేర్కొన్నారు.

మీరు బానిసలన్న ఆలోచన మాకు లేదు

విద్యార్థులు, నిరుద్యోగులను కుటుంబ సభ్యులుగా తాను భావిస్తున్నానని సీఎం తెలిపారు. ‘మేం పాలకులు.. మీరు బానిసలు అన్న ఆలోచన మాకు లేదు’ అని సీఎం చెప్పారు. తామెప్పుడూ సేవకులమేనన్నా రు. లక్షలాది మంది యువతీ, యువకులు ఉపాధి లేక రిక్రూట్‌మెంట్ బోర్డుల చుట్టూ  తిరుగుతున్నారన్నారు. ఎంతో మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారని, మనదగ్గరే అలాంటి ఉపాధి అవకాశాలు కల్పించి ఎవరూ విదేశాలకు వెళ్లకుండా చేస్తామన్నారు. సర్టిఫికెట్ ఉంటే సరిపోదు..సాంకేతి నైపుణ్యం ఉండాలన్నారు. రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలు తీసుకొచ్చి యువతకు శిక్షణ అందిస్తామన్నారు. 

అన్ని రంగాల్లో తెలుగు పోటీ పడుతున్నారు

ప్రపంచంలో ఏ మూలాన వెళ్లినా మన తెలుగు వారు ఉంటున్నారని, ప్రతీ రంగంలో తెలుగువారు సత్తా చాటుతున్నారని సీఎం తెలిపారు. తెలుగు వారు లేని రంగమంటూ ఏదీ లేదని, భవిష్యత్తులో మన రాష్ట్ర యువత ఐటీ రంగంలో ప్రపంచంతో మరింత పోటీ పడాలని, అందుకు సాంకేతికతలో శిక్షణ అవసరమన్నారు. రాష్ట్రం నలుమూలలా 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు టాటా సంస్థ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. నైపుణ్యాలను నేర్పించడం ద్వారా నిరుద్యోగులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. విద్యార్థిని, విద్యార్థులు ఐటీఐల్లో చేరాలని ఆయన కోరారు. ఈ శాఖ తన వద్దే ఉంటుందని, ఇక నుంచి ప్రతీ నెలా తానే సమీక్షాస్తానని ఆయన పేరొన్నారు. దీనికంటే ముందు ఐటీఐలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మంత్రి శ్రీధర్ బాబు, నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ విజయలక్ష్మీతో కలిసి సీఎం సందర్శించారు.

ఐటీఐల్లో విప్లవాత్మక మార్పులు: మంత్రి శ్రీధర్ బాబు

ఐటీఐ కళాశాలల్లో ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యను అందించి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఐటీఐలపై ప్రత్యేక దృష్టిసారించి, ప్రణాళిక బద్ధమైన కార్యాచరణతో వాటి అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పడ్డ దశాబ్ద కాలంలో ఐటీఐలు ఆదరణ లేకుండా పోయాయన్నారు. అత్యాధునిక టెక్నాలజీ, రోబోటిక్స్, సాంకేతిక పరికరాలతో ఏటీసీ కేంద్రాల్లో యువతకు శిక్షణ ఇస్తామన్నారు. వీఆర్‌టెక్నాలజీ ల్యాబ్‌లను సైతం మొదట ఐదు ఏటీసీ కేంద్రాల్లో అందుబాటులో తీసుసుకొస్తామన్నారు. ఇలాంటి టెక్నాలజీ దేశంలో ఐదు చోట్ల మాత్రమే ఉందని, త్వరతో 65 ఏటీసీల్లో వీటిని తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విద్యకు  పెద్ద పీట వేస్తోందని, స్కిల్‌స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.