దివ్యాంగులకు స్కూటీలు.. అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కీలక అడుగు
మంత్రి దామోదర రాజనర్సింహ్మ
ఆందోల్ (సంగారెడ్డి), మే 5: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అన్ని వర్గాల ప్రజల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జోగిపేట - ఆందోల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, ఆయాలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కనబడితే ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు.
అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో మంత్రి 10 మంది దివ్యాంగులకు ఉచిత స్కూటీలు,286 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, దివ్యాంగులు పాల్గొన్నారు.






