calender_icon.png 5 August, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సృష్టి దందాలో కదులుతున్న డొంక

05-08-2025 12:39:04 AM

  1. దేశం విడిచి పారిపోతుండగా మరో డాక్టర్ అరెస్టు
  2. గర్భిణులకు గాలం వేసే ముగ్గురు ఏజెంట్లు కూడా..
  3. ఇప్పటివరకు 12 మంది అరెస్ట్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): సరోగసి ముసుగులో సాగిన శిశువుల క్రయవిక్రయాల కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దేశం విడిచి పారిపోతుండగా మరో డాక్టర్‌ను, గర్భిణులకు గాలం వేసే ముగ్గురు ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం అరెస్టుల సంఖ్య 12కు చేరగా, విచారణలో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో సాగిన పసికందుల అమ్మకం, కొనుగోలు దందాలో పోలీసుల దర్యాప్తు కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులు కస్టడీలో ఉండగా, గత రెండు రోజుల్లో మరో ఐదుగురిని అరెస్ట్ చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. 

పారిపోతూ దొరికిన మరో డాక్టర్

ఈ కేసులో ప్రధాన నిందితురాలు నమ్రతతో పాటు, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అనుమతులు పొందిన డాక్టర్ విజ్జులత పాత్ర కూడా కీలకమని తేలింది. ఆమె దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఆమె అరెస్ట్‌తో కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. శిశువుల సేకరణలో కీలక పాత్ర పోషించిన ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్, కృష్ణతో పాటు, ఈ నెట్‌వర్క్‌ను సమన్వయం చేసిన రిసెప్షనిస్ట్ నందినిని కూడా గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 12కు చేరింది. 

ఉచితవైద్యం పేరుతో గర్భిణులకు గాలం

డాక్టర్ నమ్రత బృందం పన్నిన పక్కా ప్ర ణాళికను తెలుసుకుని పోలీసులే షాక్ అవుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ పరిస ర ఏజెన్సీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేవారని తేలింది. ఈ క్యాంపులలో పేద గర్భిణులను ఏజెంట్లు గుర్తించి, వారికి డబ్బు ఆశ చూపి హైదరాబాద్‌కు తరలించేవారు.

ఇక్కడ ప్రస వం అయ్యాక, తల్లికి కొంత డబ్బు ఇచ్చి, పుట్టి న బిడ్డను బలవంతంగా తీసుకునేవారని వి చారణలో వెల్లడైంది. ఇలా సేకరించిన శిశువులను, సంతానం లేని జంటలకు ‘సరోగసి’ ద్వారా పుట్టారని నమ్మించి, లక్షల నుంచి కోట్లాది రూపాయలకు అంటగట్టేవారని పోలీసులు గుర్తించారు.

అక్రమ సంపాదనతో ఫామ్‌హౌస్‌లు, బిల్డింగులు

ఈ దందా ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయలతో డాక్టర్ నమ్రత, ఆమె బృందం భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులు గు ర్తించారు. సికింద్రాబాద్, యూసుఫ్‌గూడ, వైజాగ్, విజయవాడ వంటి ప్రాంతాల్లో విలువైన స్థలాలు, ఫామ్‌హౌస్‌లు, భవనాలు కొను గోలు చేసినట్లు సమాచారం. ఈ ఆస్తుల వివరాలను రాబట్టే పనిలో అధికారులు నిమగ్న మయ్యారు.

కొనసాగుతున్న విచారణ.. మరిన్ని అరెస్టులు?

ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న డాక్టర్ నమ్రత, మేనేజర్ కళ్యాణి, సంతోషిలను నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో పోలీసులు విచారిస్తున్నారు. “ఇప్పటివరకు ఎంతమంది శిశువు లను ఇలా కొనుగోలు చేసి అమ్మారు? ఈ దందాలో ఎంత డబ్బు చేతులు మారింది? మీ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు?” అనే కీలక అంశాలపై వారిని ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి వస్తున్న సమాచారం ఆధారంగా, ఈ కేసులో మరికొంత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.