రామ్‌మందిర విరాళాల చోరీ వెనుక కొత్తకోణం
- దొంగిలించిన బంగారాన్ని బిస్కెట్లుగా మార్పు?
- దర్యాప్తులో నగల ఆచూకీ లభించకపోవడంతో ‘సిట్’ అనుమానాలు
లక్నో, జూలై ౪: అయోధ్య రామ్‌మందిరం విరాళాల దుర్వినియోగం ఉదంతంలో సరికొత్త కోణం వెలుగులోకి వస్తున్నది. భక్తులు కానుకలుగా ఇచ్చిన బంగారాన్ని, నిందితులు దారి మళ్లించి, గోల్డ్ బిస్కెట్లుగా మార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లోతైన దర్యాప్తు జరుపుతున్నది. విలువైన కానుకల రికార్డులు, ఇతర లావాదేవీలను జల్లెడ పడుతున్నది.
ఇప్పటికే అనేకచోట్ల సోదాలు చేసినప్పటికీ, చోరీకి గురైన నగల ఆచూకీ లభించకపోవడంతో నిందితులు వాటిని, గోల్డ్ బిస్కెట్లుగా మార్చి గుట్టుగా దాచి ఉంటారని సిట్ అనుమానిస్తున్నది. భక్తులు కానుకలుగా ఇచ్చిన దాదాపు 944 కిలోల వెండి ఆభరణాలను నాణ్యత పరిశీలన కోసం ట్రస్ట్ గతంలో ప్రభుత్వ మింట్‌కు పంపినట్లు విచారణలో తేలింది.
ఆలయానికి కానుకల రూపంలో 13 క్వింటాళ్ల వెండి, 20 కిలోల బంగారం వచ్చినట్లు గతంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సిట్ మరోవైపు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సంబంధించి, ఐదేళ్ల లావాదేవీలనూ రీఆడిట్ చేస్తున్నది.
జేబులున్న దుస్తులు నిషేధం
అయోధ్య రామ్‌మందిర విరాళాల గోల్‌మాల్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. విరాళాల లెక్కింపు వ్యవస్థలో కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే విరాళాల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో సిబ్బంది మొబైల్ ఫోన్లు, కెమెరాలు ఉపయోగించడాన్ని నిషేధించింది. అలాగే, సిబ్బంది ఎవరైనా జేబులు లేని వస్త్రాలు ధరించాల్సిందేనని జారీ చేసింది. తాజా స్ంకరణల ప్రకారం.. ఇకపై సిబ్బంది బల్లలు, కుర్చీల వద్ద కాకుండా, నేలపై కూర్చొనే విరాళాలను లెక్కించాల్సి ఉంటుంది.






