12వేల మందికి అమరనాథుని దర్శనం
యాత్రికులకు ప్రధాని మోదీ సూచనలు
శ్రీనగర్, జూలై 4 (విజయక్రాంతి): తొలిరోజు అమరనాథున్ని (మంచు శివలింగాన్ని) 12వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 9,350 మంది పురుషులు, 2,250 మంది మహిళలు, 200మంది పిల్లలు ఉన్నారు. వీరంతా నువ్వాన్, బాల్టాల్ బేస్ క్యాంపుల నుంచి రెండు బృందాలుగా బయలుదేరారు. తొలిరోజు అమర్‌నాథ్ గుహలో శివలింగానికి జమ్మూకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూలై 3 నుంచి మొదలైన యాత్ర ఆగస్ట్ 28 వరకు కొనసాగుతుంది.
అత్యంత కఠినతరమైన ఈ యాత్రను సులభతరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. దారి, కొండమార్గాల విస్తరణ చేపట్టాయి. 3,978 మీటర్ల ఎత్తు వరకు దారిలో ఐదు బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. యాత్రలోని భక్తులు ఈ క్యాంపుల్లో విశ్రాంతి తీసుకునేందుకు, వైద్య సదుపాయం తదితరాలను కల్పించారు. ఈ యాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ, పలు కఠిన నియమ నిబంధనలను అమలు చేశారు.
భక్తులకు మౌలిక సదుపాయాలు తదితరాలపై కశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గార్గ్ ప్రత్యేక చర్యలు తీసుకొని పర్యవేక్షిస్తున్నారు. యాత్ర పూర్తయ్యేంతవరకు ఈ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. కాగా అమర్‌నాథ్ యాత్రలోని భక్తులకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ఐదు ప్రతిజ్ఞతలు చేయాలని సూచించారు. పరిశుభ్రతను పాటించడం, స్థానిక ఉత్పత్తులను కొనడం, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పచ్చదనాన్ని ప్రోత్సహించడం, రక్షాబంధన్ రోజు బంధువులకు బహుమతికి మొక్కలను అందజేయాలని, దేశమే ప్రథమం అనే నినాదాలతో యాత్రను కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు.






