ఫిరాయింపులకు కొత్త నిర్వచనం
బత్తుల సత్యనారాయణ :
ఒకప్పుడు రాజకీయాల్లో ఫిరాయింపులు, పార్టీ చీలికలను ప్రజాస్వామ్యానికి ద్రోహంగా పరిగణించేవారు. ప్రజా తీర్పును అవమానించే చర్యలుగా వాటిని అందరూ విమర్శించేవారు. అయితే గత కొన్నేళ్లుగా భారత రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ఈ అభిప్రాయాన్ని గణనీయంగా మారుస్తున్నాయి.
ప్రత్యర్థి పార్టీలు, మీడియా ఇప్పటికీ వాటిని ద్రోహం, తిరుగుబాటుగా చిత్రీకరిస్తున్నప్పటికీ, చట్టపరమైన వ్యవస్థ, న్యాయవ్యాఖ్యానాలు, ఎన్నికల అనంతర రాజకీయ పరిణామాలు మాత్రం వాటిని రాజకీయ పునర్వ్యవ స్థీకరణలో భాగంగా అంగీకరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.
పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చోటుచేసుకున్న పరిణా మాలు దేశంలో పార్టీ ఫిరాయింపులు, చీలికల రాజకీయాల్లో తాజా ఉదాహరణగా నిలిచాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపు లేదా చీలికలకు తెరదీశారు. దీంతో టీఎంసీ ఇప్పుడు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు ఇతర పార్టీల్లో చేరడం, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం రాజకీయ చర్చకు దారితీసింది.
బంగాల్‌లో ఘోర ఓటమి తర్వాత
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కొద్ది వారాల్లోనే టీఎంసీకి చెందిన సుమారు 60 మంది ఎమ్మెల్యేలు నాయకత్వంపై తిరుగుబాటు చేసి కొత్త శాసనసభా నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. పార్టీ కుటుంబ పాలన, అవినీతి, పరిపాలనా వైఫల్యాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వారు ఆరోపించారు. పార్లమెంట్‌లో కూడా 20 మంది ఎంపీలు వేరుకుంపటి పెట్టుకున్నారు. ఈ క్రమం లో వారంతా మరో రాజకీయ వేదికతో కలవడం ద్వారా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉన్న విలీన నిబంధనలను ఆశ్రయించారు.
టీఎంసీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దీదీ అభిమానులు రెబల్ ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యవహారశైలిని రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు, తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను కాపాడుకునేందుకు టీఎంసీ చేపట్టిన చర్యలు ఏమాత్రం ఫలితాలను ఇవ్వలేదు. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నేతలు అది టీఎంసీ అంతర్గత వ్యవహారమని, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగానే వ్యవహరిస్తున్నారని వాదిస్తున్నాయి. అయితే, పార్టీలో ఇంత పెద్ద స్థాయిలో చోటుచేసుకున్న విభేదాలను కేవలం బాహ్య ప్రభావాల వల్ల ఏర్పడినవిగా భావించలేం. పార్టీ అంతర్గత సంక్షోభానికి, నాయకత్వంపై పెరిగిన అసంతృప్తికి సంకేతంగా కూడా ఈ తిరుగుబాటును చూడాల్సి ఉంటుంది.
మహారాష్ట్రలో రెండు పార్టీల్లో చీలిక
మహారాష్ట్రలో 2022లో జరిగిన శివసేన చీలికను పశ్చిమ బంగాల్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామం గుర్తుచేస్తోంది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం శివసేన పార్టీ రూపురేఖలను, రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు పొందిన షిండే వర్గం చివరకు పార్టీ పేరు, గుర్తును కూడా సొంతం చేసుకుంది. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ రెండూ శాసనసభలోని సంఖ్యాబలానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. ఒకప్పుడు వెన్నుపోటుగా విమర్శలకు గురవుతూ వచ్చిన ఇలాంటి పరిణామాలను ఇప్పుడు రాజకీయ వాస్తవికతకు నిదర్శనమని చెప్పుకొనే పరిస్థితి వచ్చింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో అజిత్ పవార్ నేతృత్వంలో జరిగిన విభజన కూడా ఇదే ధోరణిని బలపరిచింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌కు వ్యక్తిగత గౌరవం కొనసాగినప్పటికీ, పార్టీ సంస్థాగత నియంత్రణ, ప్రజాప్రతినిధుల మద్దతు అజిత్ పవార్ వర్గం వైపు మొగ్గుచూపాయి. ఎన్నికల సంఘం కూడా దాని ఆధారంగా పార్టీ పేరు, గుర్తును అజిత్ వర్గానికే కేటాయిం చింది. దీంతో అసలు పార్టీని నిర్ణయించడంలో భావోద్వేగాల కంటే సంఖ్యాబలమే కీలకమనే అభిప్రాయం క్రమంగా బలపడుతున్నది.
ఆప్‌ను వదలని జాఢ్యం
అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా అంతర్గత విభేదాలకు అతీతం కాలేకపోయింది. పార్టీ వ్యవస్థలో అధిక కేంద్రీకరణ, నిర్ణయాధికారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలువురు కీలక నేతలు ఆ పార్టీకి దూరమయ్యారు. ఇది సంప్రదాయ పార్టీల సమస్య మాత్రమే కాదని, కొత్త రాజకీయ శక్తులు కూడా అదే సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఆప్‌లో నెలకొన్న సంక్షోభం తేటతెల్లం చేసింది.
భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపులను నిరోధించే నిబంధనలు అమలులో ఉన్నాయి. ఒక ప్రజాప్రతినిధి పార్టీ ఫిరాయిస్తే లేదా పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, అతనిపై అనర్హత చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో తుది నిర్ణయం తీసుకునే వరకు చాలా సమయం పడుతుంది. రాజ్యాంగం, చట్టపరంగా జరుగుతున్న ఈ ఆలస్యం ఫిరాయింపుదారులకు వరంగా మారింది.
దేశవ్యాప్తంగా ఇలాంటి రాజకీయ పరిణామాలు కొత్త వి కావు. భారత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు కొత్త విషయం కాదు. అనేక రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రజాప్రతినిధుల ఫిరాయింపులు ఎప్పటినుంచో జరుగుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యా నా వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులు భారీగా బీజేపీలో చేరిన సందర్భాలు ఉన్నాయి. తమిళనాడులో, ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల్లోనూ ఇలాంటి రాజకీయ పునర్వ్యవస్థీకరణలు తరచూ కనిపిస్తున్నాయి.
అయితే ప్రజలు ఒక పార్టీ గుర్తుపై ఓటు వేసిన తర్వాత ఎన్నికైన ప్రతినిధి మరో పార్టీకి వెళ్లడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. అందువల్ల తృణమూల్ కాంగ్రెస్ లేదా శివసేన లేదా ఎన్సీపీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యుల ఫిరాయింపు అంశం ఒక పార్టీ సమస్య మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా రాజకీయ నైతికత, ప్రజా తీర్పు గౌరవం, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాల ప్రభావంపై జరుగుతున్న పెద్ద చర్చలో భాగంగా మారింది. అయితే, భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో విలీనాలకు కల్పించిన మినహాయింపులు, ఇటీవల కాలంలో స్పీకర్లు, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలు ఈ ప్రక్రియకు చట్టబద్ధతను కల్పించాయి.
ప్రలోభాలు, అధికార దాహం
అయితే దేశంలోని అనేక రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న ఈ ఫిరాయింపులు, పార్టీల చీలికలు, విలీనాల వల్ల ఎలాంటి సమస్యలు లేవని చెప్పలేం. డబ్బు ప్రలోభాలు, అధికార దాహం, ప్రజా తీర్పు పట్ల నిర్లక్ష్యం వంటివి వీటి వెనుక ఉన్నాయని తరచూ ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఒక పార్టీ తరఫున గెలిచి, ఆ తర్వాత మరో రాజకీయ శిబిరంలో చేరడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది.
అందుకే ఈ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత అవసరం. అదే సమయంలో స్పీకర్ నిర్ణయాలపై స్వతంత్ర పరిశీలన, ఫిరాయింపు కేసులపై వేగవంతమైన విచారణ, రాజకీయ నిధుల పారదర్శకత వంటి సంస్కరణలు అవసరమనే వాదనలు బలపడుతున్నాయి. రాజకీయ పార్టీల్లో జరిగే ఇలాంటి పరిణామాలను పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాకపోయినా, దానికి స్పష్టమైన నియమాలు ఉండటం ప్రజా స్వామ్యానికి మేలు చేస్తుంది.
భారత రాజకీయాలు ఇప్పుడు స్థిరమైన వ్యవస్థల కన్నా మారుతున్న సమీకరణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఒకప్పుడు తిరుగుబాటుగా పరిగణించిన చర్య లు, నేడు అధికార పునర్వ్యవస్థీకరణలో భాగంగా మారుతున్నాయి. పశ్చిమ బంగాల్లో టీఎంసీ ఎదుర్కొంటున్న సంక్షోభం కూడా ఈ విస్తృత ధోరణిలో భాగమే. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పా, లేక రాజకీయ వ్యవస్థ తనను తాను సరిచేసుకునే ప్రక్రియనా అన్నది చివరికి ప్రజలే ఎన్నికల ద్వారా నిర్ణయిస్తారు.
వ్యాసకర్త: జర్నలిస్ట్






