25 August, 2026 | 3:29 AM

శివుడి లీలలపై కొత్త సినిమా

25-08-2026 12:00 AM

తెలుగు వెండితెరపై మరో భక్తి రస చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆధ్యాత్మికత, భక్తి, భావోద్వేగాలను మేళవిస్తూ తెరకెక్కనున్న ఈ కొత్త సినిమా ‘శివాలయం’ పేరుతో రానుంది. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆచంట మహేశ్ (‘రంగస్థలం’ ఫేమ్), కాంచన దీప్తిరెడ్డి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్రెడ్డి నంది దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఘర్షణ శ్రీనివాస్, లెంకల అశోక్ రెడ్డి, మురం రెడ్డి వెంకటేశ్వర్లు, కుప్పిలి శ్రీనివాస చారి,

మధుమతి కొక్కంటి, ముత్యాల ఉమా, చిట్టిబాబు, దిల్ రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ముహూర్తపు కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, కళాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నిర్మాత వెంకట్రెడ్డి నంది మాట్లాడుతూ..

“శివుడి లీలలు, మహిమలు తెరపై ఆవిష్కరించాలని ‘శివాలయం’ చిత్రానికి శ్రీకారం చుట్టాం. వచ్చే సెప్టెంబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా కథ, ఇతర నటీనటులు, సాంకేతిక అంశాలు, షూటింగ్ వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాం” అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: డ్రమ్స్ రాము; డీవోపీ: డీ యాదగిరి.