31 July, 2026 | 12:52 PM

కవిత పేరిట కొత్త నాటకం

03-09-2025 12:43 AM
  1. కేసీఆర్ కుటుంబంలో వాటాల పంపిణీ గొడవలు
  2. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆలస్యమైతే బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటైనట్లే..
  3. కవిత సస్పెండ్ వ్యవహారం బీఆర్‌ఎస్ అంతర్గత అంశం 
  4. మేం కాంగ్రెస్‌లో కవితను చేర్చుకోం !
  5. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్  

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత పేరుతో కొత్త నా టకం మొదలైందని  పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. వాటాల పంపకాల్లో గొడవ లు వచ్చి ఆ కుటుంబంలో అంతర్గత కుమ్ములాట మొదలైందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుపై కవిత చేసిన అవినీతి ఆరోపణలు నిజమైతే, కేసీఆర్ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై న్యాయ కోవిదుడైన పీసీ ఘోష్ పరిపూర్ణమైన విచారణ జరిపి వాస్తవాలను వెలికితీశారని, తద్వారానే కేసీఆర్, హరీశ్‌రావు దోషు లుగా తేల్చారని స్పష్టం చేశారు. పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలోనూ చర్చించామని గుర్తుచేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని, ఇదే విషయాన్ని బీజేపీ జాతీ య అధ్యక్షుడు జేపీ నడ్డా మొదలుకొని ఎంతోమంది బీజేపీ అగ్రనేతలు సభల్లో ప్రస్తావ రించారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలకు నీతివంతమైన పాలన అందిస్తుంటే బీఆర్‌ఎస్, బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతు న్నాయన్నారు. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ చేసిన పాపాలను  ప్రక్షాళన చేస్తుంటే, బీజేపీ ఆ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నదని దుయ్యబ ట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కర్త, కర్మ, క్రియ అని తానే అని చెప్పుకొన్న కేసీఆర్ అవినీతికి కూడా బాధ్యత వహించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కవిత ఇటీవల చేసిన వ్యాఖ్లయతో కాళేశ్వరం పరిధిలో అక్రమాలు జరిగాయని తేలిపోయింద న్నారు. ‘కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ వాటా ఎం త..? హరీశ్ రావు వాటా ఎంత..? ఇతరుల వాటా ఎంత? అనేది సీబీఐ విచారణలో తేలుతుందని వివరించారు. ‘కేసిఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత అన్నారు.

ఆ దెయ్యాలెవరో కవిత చెప్తే బాగుండేది. నిన్న మొన్నటివరకు కేటీఆర్‌పై అనేక ఆరోపణలు చేసిన కవిత, ఇప్పుడా అస్త్రాన్ని హరీశ్‌రావుపై మరల్చడం వెనక ఆంతర్యమేంటి?’ అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కేసు ఇక సీబీఐ కోర్టులోకి వెళ్లిందని, ఇక కేంద్ర మంత్రులు  కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకుని నిజా ల నిగ్గు తేల్చాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ హయాంలో  ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని విమర్శించారు.

నీటిపారుదలశాఖ అధి కారుల మాటలు లెక్కచేయకుండా కేసీఆర్ అన్ని తానై వ్యవహరించారని ఆరోపించారు. సీబీఐ ఒకవేళ విచారణ వేగవంతంగా చేయకుండా సాగ దీస్తే  బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య చీకటి ఒప్పందం మరోసారి బయటపడుతుందన్నారు. ‘కవితను కాంగ్రెస్‌లో చేర్చుకుంటారా?’ అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. అందుకు మహేష్‌కుమార్‌గౌడ్ ‘చేర్చుకునే ప్రశక్తే లేదు’ అని స్పష్టం చేశారు.

కవిత సస్పెండ్ వ్యవహారం బీఆర్‌ఎస్ అంతర్గత వ్యవహారమని, తమకేమీ సంబంధం లేదని కొట్టిపడేశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్త శుద్ధి ఉంది కాబట్టే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల  బిల్లు తీసుకొచ్చిందన్నారు. ముస్లింలను బూచీగా చూపి బీజేపీ బీసీల నోటి కాడ ముద్ద లాగేస్తోందని ధ్వజమెత్తారు.

బీసీ రిజర్వేషన్ల కోసం అఖిల పక్షంతో కలిసి గవర్నర్ దగ్గరకి వెళితే బీజేపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేశారని మండిపడ్డారు.  సీఎం రేవంత్‌రెడ్డికి ఎవరిని వెనకోసుకోచ్చే అవసరం లేదని, కొన్ని సందర్భాల్లో  సీబీఐపై సీఎం ఆరోపణలు చేశారని గుర్తుచేశారు.