కులగణన అమలుపై అనుమానాలు
కులగణన అనేది సామాజిక న్యాయానికి పునాది. భారతదేశ 79 ఏళ్ల స్వాతంత్య్రనంతర చరిత్రలో ఎన్నో కీలకమైన అంశాలు చర్చకు వచ్చాయి. భూసంస్కరణలు, రిజర్వేషన్లు, భాషా రాష్ట్రాలు, ఆర్థిక సంస్కరణలు వంటి అనేక అంశాలు దేశ భవిష్యత్తును ప్రభావితం చేశాయి. అయితే ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాని, సామాజిక న్యాయంతో నేరుగా సంబంధం ఉన్న అంశం కులగణన.
దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలు, ఇతర వెనుకబడిన వర్గాలు తమ నిజమైన జనాభా, సామాజిక-, ఆర్థిక స్థితిగతులు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కావాలని దశాబ్దాలుగా కోరుతున్నాయి. కానీ, రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని ఎన్నికల సమయంలో వాగ్దానంగా ఉపయోగించుకున్నప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు విషయంలో వెనుకడుగు వేస్తూ వచ్చాయి.
భారత్‌లో కులాల ఆధారంగా సమాచార సేకరణ కొత్త విషయమేమీ కాదు. బ్రిటిష్ పాల కులు 1881 నుంచే జనగణనలో కులగణన ప్రక్రియను ప్రారంభించారు. 1931 జనగణనలో చివరిసారిగా అన్ని కులాల సమగ్ర సమాచారాన్ని సేకరించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కులగణన జరగలేదు. రాజ్యాంగపరమైన అవసరాల దృష్ట్యా ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలు కొనసాగించినప్పటికీ, బీసీల సమగ్ర సమాచార సేకరణ నిలిచిపోయింది. ఇది ఒక పెద్ద అన్యాయం. ఎందుకంటే దేశంలోని సంక్షేమ విధానాలు, రిజర్వేషన్లు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ వెనుకబాటుతనం ఆధారంగా రూపొందుతాయి. కానీ, అత్యధిక జనాభా కలిగిన బీసీల విషయంలో మాత్రం కచ్చితమైన గణాంకాలే లేవు.
కాకా కాలేల్కర్ నుంచి మండల్ వరకు: మొట్టమొదటి వెనుకబడిన వర్గాల కమిషన్ అయిన కాలేల్కర్ కులాలవారీగా సమాచారం సేకరించడం అవసరమని సూచించి ంది. తరువాత మండల్ కమిషన్ కూడా దేశంలో బీసీల అసలు పరిస్థితిని అంచనా వేయడానికి కులగణన అవసరమని పేర్కొంది. మండల్ కమిషన్ 1931 జనగణన గణాంకాల ఆధారంగా బీసీల జనాభాను అంచనా వేయాల్సి వచ్చింది. 21వ శతాబ్దంలోనూ 1931 గణాంకాల ఆధారంగా విధానాలు రూపొందించడం ఎంత అసంబద్దమో ఆలోచిందాలి.
కులగణన అంటే ఏమిటి?: కులగణన అంటే కేవలం కులాల లెక్కింపు కాదు. కులగణన భారతీయ సమాజానికి ఒక రోగ నిర్ధారణ సాధనం, ఒక ఎక్స్‌రే. శరీరంలో ఉన్న వ్యాధులను ఎక్స్‌రే బయటపెట్టినట్లే, సమాజంలో ఉన్న అసమానతలను కులగణన బయటపెడుతుంది.
ఏ వర్గానికి ఎంత భూమి ఉంది? ఎవరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు? ఎవరు ఉన్నత విద్య పొందుతున్నారు? ఎవరు ఇంకా నిరక్షరాస్యులుగానే ఉన్నారు? ఎవరి ఆదాయం ఎంత? ఎవరి రాజకీయ ప్రాతినిధ్యం ఎంత? అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఎవరికీ చేరుతున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలిసినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.
రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరి: కులగణన విషయంలో దాదాపు అన్ని జాతీయ పార్టీలు ద్వంద్వ వైఖరిని ప్రదర్శించాయి. 2010లో కులగణన నిర్వహించాలని పార్లమెంట్‌లో బీజేపీ ప్రతిపాదించగా, ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. కానీ, అప్పటి కేంద్రప్రభుత్వం సాధారణ జనగణనలో కులాలను చేర్చకుండా ప్రత్యేక సామాజిక-, ఆర్థిక-కుల సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఫలితాలు పూర్తిస్థాయిలో వెలుగులోకి రాలేదు.
మరోవైపు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణనకు మద్దతు తెలిపిన, 2018లోనూ అనుకూల ప్రకటనలు చేసిన బీజేపీ.. 2021లో మహారాష్ట్ర స్థానిక సంస్థల రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కులగణన సాధ్యం కాదని పేర్కొంది. అనంతరం ప్రజా సంఘాల ఒత్తిడికి తలొగ్గి, బీహార్ ఎన్నికలకు ముందు మళ్లీ అనుకూలమని ప్రకటించింది. అంతేకాదు, 2025 ఏప్రిల్ 30న కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదించింది. కులగణనను అనేక పార్టీలు సామాజిక న్యాయం కోణంలో కాకుండా రాజకీయ అవసరాలకు అనుగుణం గా చూస్తున్నాయని దీని ద్వారా తెలుస్తున్నది.
బీసీలకు ఎందుకు అవసరం?: ఎస్సీ, ఎస్టీలకు జనగణనలో కులగణన జరుగుతుంది. అలాగే, ఓసీల జన సం ఖ్య తక్కువగా ఉన్నప్పటికీ అవకాశాలు అన్ని వారే అందిపుచ్చుకుంటున్నారు, కులాల లెక్కలు తీస్తే వారి దోపిడీ బయటపడుతుంది కాబట్టి, వారికి అవసరం లేదు. ఇక మిగిలిపోయిన బీసీలకు మాత్రమే కులగణన అవసరం.
కులగణన జరగకపోవడంతో బీసీలకు తీవ్రనష్టం జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీల వాటా ఎంత? ఉన్నత విద్యాసంస్థల్లో వారి ప్రాతినిధ్యం ఎంత? న్యాయవ్యవస్థలో వారి స్థానం ఎంత? పారిశ్రామిక రంగంలో వారి భాగస్వామ్యం ఎంత? ఈ ప్రశ్నలకు అధికారిక సమాధానాలు లేవు. అదే సమయంలో రిజర్వేషన్లను వ్యతిరేకించే శక్తులు ‘బీసీలు ఇప్పటికే అభివృద్ధి చెందారు’ అని వాదిస్తుంటాయి. గణాంకాలు లేకపోవడంతో ఆ వాదనలను శాస్త్రీయంగా ఖండించడం కష్టమవుతోంది.
అందుకే కులగణన బీసీలకు కేవలం ఒక డిమాండ్ కాదు; అది వారి రాజ్యాంగ హక్కుల రక్షణకు అవసరమైన సాధనం. కేవలం జనాభాలో కులాల లెక్కలు మాత్రమే తీసుకోవడం సరిపోదు. తెలంగాణలో నిర్వహించిన సమగ్ర సామాజిక, -ఆర్థిక సర్వే మాదిరిగా దేశవ్యాప్తంగా విద్య, ఉపాధి, భూమి యాజమాన్యం, ఆదాయం, రాజకీయ ప్రాతినిధ్యం, వృత్తులు, నివాస పరిస్థితులు వంటి అంశాలను నమోదు చేయాలి. ఎందుకంటే కులం ఒక సామాజిక గుర్తింపు కాదు; అది ఆర్థిక అవకాశాలు, విద్యా అవకాశాలు, అధికార భాగస్వామ్యంతో ముడిపడి ఉంది.
కులగణనపై కోర్టుల అభిప్రాయం: అనేక సందర్భాలలో బీసీల కులాల లెక్కలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభు త్వాలు పెంచిన రిజర్వేషన్లను కోర్టులు కొట్టివేశాయి. సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో కులాల సామాజిక, విద్యా వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి కచ్చితమైన, సమకాలీన గణాంకాలు అవసరమని స్పష్టం చేసింది.
1. ఇంద్రా సాహ్ని కేసులో (1992) రిజర్వేషన్లు, వెనుకబడిన వర్గాల గుర్తింపు వాస్తవ ఆధారాల మీద ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. 1931 జనగణన తర్వాత సమగ్ర కులాల డేటా లేకపోవడాన్ని కూడా ప్రస్తావించింది. ఈ తీర్పు కులగణన అవసరాన్ని పరోక్షంగా బలపర్చింది.
2. మరాఠా రిజర్వేషన్ కేసులో (2021) వెనుకబాటుతనాన్ని నిరూపించడానికి పరిమాణాత్మక, అనుభవాధారిత డేటా తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో కులాలవా రీ గణాంకాల అవసరం మరింత స్పష్టమైంది.
3. కులగణనపై సుప్రీంకోర్టు పరిశీలనలు (సుధాకర్ గుమ్ముల వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ ‘వెనుక బడిన వర్గాల జనాభా ఎంత ఉందో ప్రభుత్వం తెలుసుకోవడంలో తప్పేమీ లేదు’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిం చింది. అయితే కులగణన నిర్వహించాలా, వద్దా అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పేర్కొంది.
4. మద్రాస్ హైకోర్టు కేసు (సెన్సస్ కమిషనర్ వర్సెస్ ఆర్.కృష్ణమూర్తి): హైకోర్టు ఒక సందర్భంలో కులాల లెక్కింపు చేపట్టాలని కేంద్రానికి సూచించింది. అయితే సుప్రీంకోర్టు తరువాత జనగణన నిర్వహణ ప్రభుత్వ విధాన అంశమని చెబుతూ ఆ ఆదేశాన్ని రద్దు చేసింది. సుప్రీంకోర్టు కులగణనను నేరుగా ఆదేశించలేదు. కానీ, ఇంద్రా సాహ్ని, మరాఠా రిజర్వేషన్ వంటి తీర్పుల ద్వారా రిజర్వేషన్లు, సామాజిక న్యాయ విధానాలు కచ్చితమైన కులాలవారీ డేటాపైనే ఆధారపడాలని స్పష్టం చేసింది. అందువల్ల కులగణనకు బలమైన న్యాయపరమైన, రాజ్యాంగపరమైన ఆధారం ఈ తీర్పులలో కనిపిస్తుంది.
5. ఫిబ్రవరి 2న 2026 ఆకాశ్ గోయల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, రాబోయే కులగణనలో కేవలం వ్యక్తుల స్వీయ ప్రకటన ఆధారంగా కులాలను నమోదు చేయడం సరిపోదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కుల వివరాల నమోదు కోసం ధ్రువీకరించదగిన యంత్రాంగాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం, రిజిస్ట్రార్ జనరల్, సెన్సన్ కమిషనర్ కార్యాలయాలకు సూచించింది. అయితే కులగణన విధానంలో ప్రత్యక్ష జోక్యం చేసుకోకుండా, పిటిషనర్ సూచనలను పరిశీలించాలని మాత్రమే ఆదేశించింది.
చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి: నిజంగా కులగణన నిర్వహించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటినుంచే ఏర్పాట్లు ప్రారంభించాలి. దేశవ్యాప్తంగా అన్ని కులాల జాబితాను సిద్ధం చేయాలి. ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ కేటాయించాలి. గణన సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. సమాచారం సేకరణకు శాస్త్రీయ విధానాలు రూపొందించాలి. లేకపోతే ఒకే కులం వివిధ ప్రాంతాల్లో, వివిధ పేర్లతో నమోదు కావడం వల్ల డేటా నాణ్యత దెబ్బతింటుంది. కేంద్రం కులగణన నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ, దానికి అవసరమైన శాస్త్రీయ విధానాలు, ఫార్మాట్లు, డేటా సేకరణ ప్రమాణాలపై ఇప్పటివరకు స్పష్టమైన చర్చలు ప్రారంభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
సాధారణ జనగణనలో పరిమితంగా 42 కాలమ్స్ మాత్రమే ఉంటా యి. అయితే కులగణన అనేది కులాల పేర్లు నమోదు చేయడమే కాదు; సామాజిక, విద్యా, ఆర్థిక, రాజకీయ, ఉపాధి సంబంధిత వెనుకబాటుతనాన్ని కూడా శాస్త్రీయంగా కొలవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కులగణన ఫార్మాట్ ఎలా ఉండాలి? ఎన్ని కాలమ్స్ ఉం డాలి? కులాల వర్గీకరణ ఎలా చేయాలి? వంటి అంశాలపై ఇప్పటినుంచే నిపుణులు, సామాజిక సంస్థలతో విస్తృత చర్చలు జరగాలి. కానీ, అలాంటి ప్రక్రియ ఇప్పటివరకు కనిపించడం లేదు.
తెలంగాణలో ఇటీవల నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి కుల సర్వే ఒక ముఖ్యమైన న మూనాగా ఉంది. అలాగే బీహార్, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో జరిగిన కుల సర్వేల విధానాలను కూడా కేంద్రం అధ్యయ నం చేయాలి. వాటి మంచీచెడులను పరిశీలించి, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా దేశవ్యాప్తంగా అమలు చేయగల శాస్త్రీయ ఫార్మాట్ రూపొందించాలి. అయితే ప్రస్తుతం అలాంటి సన్నాహక చర్యలు కనిపించడం లేదు.
సెన్సస్ మొదటి దశ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్లలోనూ ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు ప్రత్యేక కాలమ్ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కులగణనకు సంబంధించిన విధివి ధానాలు, ప్రశ్నాపత్రాలు, ధ్రువీకరణ వ్యవస్థలు, డేటా వర్గీకరణ ప్రమాణాలపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో కేంద్రం నిజంగా కులగణన నిర్వహిస్తుందా, లేదా? అనే సందేహాలు పెరుగుతున్నాయి. కాబట్టి కేంద్రం వెంటనే కులగణనకు సంబంధించిన పూర్తి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలి. కులగణనను పారదర్శకంగా, నిష్పక్ష పాతంగా నిర్వహించటానికి ఒక స్వతంత్ర కమిషన్‌ను ఏర్పరచాలి.
ఆ కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటనలు నిర్వహించి, అన్ని వర్గాలతో చర్చలు జరిపి సమగ్ర ప్రణాళిక రూపొందిదాలి. అప్పుడే కేంద్రాన్ని బీసీ ప్రజలు విశ్వసిస్తారు. అప్పుడే కులగణనపై ఉన్న అనుమానాలు తొలగి, సామాజిక న్యాయం దిశగా ఒక చారిత్రక అడుగుపడినట్లవుతుంది. లేకుంటే తూతూమంత్రంగా నిర్వహించి, అందులో తప్పులు ఉన్నాయని, గణాంకాలను ప్రకటించరు. ఇదే పాలకుల పన్నాగం కావచ్చని అనిపిస్తోంది.
కులగణనపై భయమెందుకు?: కొన్ని ఆధిపత్య వర్గాలు కులగణనను వ్యతిరేకించడం వెనుక ఒక కారణం ఉంది. కులగణన వాస్తవాలను బయటపెడుతుంది. ఇప్పటివరకు ‘అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి’ అనే ప్రచారం కొనసాగింది. కానీ, కులగణన తర్వాత అధికార, ఆస్తి, విద్య, ఉపాధి రంగాల్లో ఎవరి ఆధిపత్యం ఉందో స్పష్టమవుతుంది. అందుకే కులగణనకు వ్యతిరేకంగా అనేక అపోహలు, దుష్ప్రచారాలు సృష్టిస్తున్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర బహుజన వర్గాలు దీనిని ఒక ప్రజాస్వామ్య హక్కుగా భావించి ఉద్యమించాలి. ‘జనాభాకు తగిన ప్రాతినిధ్యం’ అనే సూత్రం అమలు కావాలంటే ముందుగా జనాభా ఎంత ఉందో తెలుసుకోవాలి. ‘హిస్సా’ కావాలంటే ముందు సంఖ్యలు తెలియాలి. ‘ఇజ్జత్’ కావాలంటే వాస్తవాలు వెలుగులోకి రావాలి. ‘హుకుమత్’ కావాలంటే సమాజ నిర్మాణం గురించి శాస్త్రీయ అవగాహన ఉండాలి.
కులగణన అనేది కులాలను బలపరిచే కార్యక్రమం కాదు; కులాల ఆధారంగా ఉన్న అసమానతలను గుర్తించి వాటిని తగ్గించే ప్రజాస్వామ్య ప్రక్రియ. అది దేశాన్ని విభజించే సాధనం కాదు; సమాన అవకాశాలతో కూడిన సమాజాన్ని నిర్మించే పునాది. ఈసారి కూడా కులగణన రాజకీయ వాగ్దానంగా మిగిలిపోతుందా? లేక నిజంగా అమలై సామాజిక న్యాయానికి కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం రాబోయే కాలంలో తెలుస్తుంది.
అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. కులగణన లేకుండా సామాజిక న్యాయం అసంపూర్ణం. గణాంకాలు లేని విధానాలు అంధకారంలో నడిచే ప్రయాణం లాంటిది. అందుకే కులగణన కోసం జరుగుతున్న పోరాటం కేవలం సంఖ్యల కోసం కాదు: సమానత్వం, ప్రాతినిధ్యం, ఆత్మగౌరవం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటం. బీసీ సమాజం జాగురూకతతో ఉంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచకుంటే మరోసారి బీసీలకు అన్యాయం తప్పదేమోనని అనిపిస్తోంది.
వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్,
బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్
టీ చిరంజీవులు






