ఇరాన్‌కు కాళరాత్రి X ప్రాణాలిస్తాం!
ఈ రాత్రి అక్కడి నాగరికత అంతం
47 ఏళ్ల అరాచక పాలనకు చరమగీతం పాడతాం
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు
- అణు బాంబు ప్రయోగిస్తారా? అనే అంశంపై వైట్‌హౌస్‌లో చర్చ.. గుప్పుమంటున్న వార్తలు
- 48 గంటలపాటు బయటకు రావద్దు: భారతీయులకు అడ్వైజరీ
వాషింగ్టన్/టెహ్రాన్, ఏప్రిల్ 7: అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. ఇరాన్‌కు విధించిన 48 గం టల గడువుకు ముందే, ఆ దేశ ఆదాయానికి ఆయువుపట్టున ఖర్గ్ దీవిపై దాడులకు దిగారు. అలాగే, ఇరాన్‌పై అమెరికా అణు బాంబు ప్రయోగిస్తుందా? అనే అంశంపైనా వైట్‌హౌస్ నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే, దీనిపై అధికార ప్రకటన ఏమీ లేదు. మరోవైపు, ‘ఇరాన్ నాగరికత మంగళవారం రాత్రితో అంతం కాబోతున్నది.
ఇక ఆ నాగరికతను ఎప్పటికీ, ఎవరూ పునరుద్ధరించలేరు’ అంటూ ట్రంప్ ‘ట్రూత్ సోష ల్’ వేదికగా హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఆ దేశంలో 47 ఏళ్లుగా సాగుతున్న దోపిడీ, అవినీతి, అరాచక పాలనకు చరమగీతం పాడతామని స్పష్టంచేశారు. తాను వినాశనాన్ని కోరుకోవడం లేదని, కానీ.. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అది తప్పేలా లేదని రాసుకొచ్చారు. ఇరాన్‌లో పూర్తిస్థాయి అధికార మార్పు రావా లని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
తెలివిమంతులు, తీవ్రవాద వైఖరి అవలంబించని నేతలు అధికారంలోకి రావాలని తాము ఆకాంక్షిస్తున్నామని వివరించారు. ఇరాన్ ప్రజలు గొప్పవారని, వారిపై దేవుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచ చరిత్రలోనే ఇది కీలకమైన మైలురాయిగా నిలిచిపోతుందని జోస్యం చెప్పారు. 48గంటల్లో ఇరాన్ హోర్మూజ్ జలసంధిని తెరవకపోతే, ఆ దేశంలోని వంతెనలు, విద్యుత్ ప్లాంట్లను పేల్చివేస్తామని సోమవారం ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు కంటే ముందే ఖర్గ్ దీవిపై భీకర దాడి మొదలైంది. ఇరాన్ ఆదాయానికి ప్రధాన వనరైన చమురు నిక్షేపాల దీవి ఖర్గ్‌పై మంగళవారం అమెరికన్ సైన్యం దాడులు ప్రారంభించింది. ఒకేసారి సుమారు ౫౦ చోట్ల పేలుళ్లు సంభవించాయి. ట్రంప్ మునుపటి గడువు ప్రకారం.. అగ్రరాజ్యం హెచ్చరికలకు లోబడి ఇరాన్ మంగళవారం రాత్రి 8 గంటల (ఈస్ట్ టైమ్) కల్లా హోర్ముజ్ జలసంధి తెరవాల్సి ఉంది.
కాల్పుల విరమణకు కూడా అంగీకరించాల్సి ఉంది. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయానికి ఆ గడువు ముగస్తుంది. ఒకవేళ జలసంధి తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లను, వంతెనలను ధ్వంసం చేస్తామనేది ట్రంప్ హుకుం. కానీ, ఇంతలోనే ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఖర్గ్‌పై వైమానిక దాడులను ఉధృతం చేశారు.
దీంతో దీవిపై దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దాడులతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రపంచ ఇంధన మార్కెట్ తీవ్ర ఆందోళన నెలకొంది. ఒకవేళ ఖార్గ్ దీవి పూర్తిగా ధ్వంసమైతే, ఇరాన్ ఆర్థికంగా కోలుకునేందుకు కొన్ని దశాబ్దాల సమయం పడుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
దీవి ఇరాన్ రత్నకిరీటం..
ఇరాన్ నుంచి ౨౬ కి.మీ, హోర్ముజ్ జలసంధికి వాయువ్యంగా ౪౮౩ కి.మీ దూరంలోని లోతైన సముద్ర జలాల్లో ఖర్గ్ దీవి ఉంది. దీవిపై ౨4 x7 ఇరాన్ సైన్యం నిఘా ఉంటుంది. ఇతర దేశాలకు దీవిలో ప్రవేశం నిషేధం. దీవికి ఇరాన్ రత్న కిరీటం అనే పేరుంంది. ఆ దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతయ్యే చమురులో దాదాపు 90 శాతం చమురు దీవి నుంచే ఉత్పత్తి అవుతుంది. దీవి వెంట లోతైన సముద్ర జలాలు ఉండటంతో యుద్ధ ట్యాంకర్ల ప్రవేశం సులభం. అమెరికన్ సైన్యం ఈ అవకాశాలన్నింటినీ వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే, అమెరికా దీవిని పూర్తిగా తుడిచిపెట్టేసే అవకాశం ఉంది. ఇరాన్ ప్రధాన ఆర్థిక మూలాన్ని దెబ్బతీసేందుకే అమెరికా ఈ దీవిని ఎంచుకుంది.
ఇరాన్‌లో విధ్వంసం.. -పౌరుల మృతి..
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా మంగళవారం ఇరాన్‌పై వైమానిక దాడులు చేశాయి. దాడుల్లో అనేక వంతెనలు, రైల్వే మార్గాలు ధ్వంసం అయ్యాయి. ఖాషాన్ నగరంలోని యాహ్యా అబాద్ రైల్వే వంతెన కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. షహ్రియార్ నగరంలోని నివాస ప్రాంతాలపై జరిగిన దాడుల్లో తొమ్మిది మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. అల్బోర్జ్ ప్రాంతంలో దాడుల్లో 18 మంది వరకు మృతిచెందారు. ఖరాజ్ నగరంలో దాడుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అంతర్జాతీయ సంక్షోభం.. ఆందోళనలు
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం వల్ల ఇంధన కొరత ఏర్పడి శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు 320 మిలియన్ డాలర్ల రాయితీ ప్యాకేజీ ప్రకటించింది. యుద్ధ తీవ్రత పెరిగితే ఇంకా అనేక దేశాలు ఇంధన కొరత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన మార్గం. ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే ముడిచమురులో మూడో వంతు దీని గుండానే రవాణా అవుతుంది. అమెరికా సైన్యం తీసుకోబోయే సైనిక చర్యలను ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఊపిరి బిగబట్టి గమనిస్తున్నాయి.
అణు దాడుల వార్తల్లో నిజం లేదు!
ఇరాన్‌పై తాము అణు దాడులు చేయబోతున్నామన్నామనేవి, కేవలం వదంతులు మాత్రమేనని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. తమ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల తమ అమ్ములపొదిలో ఎన్నో రకాల ఆయుధాలు ఉన్నాయని, వాటిని ప్రయోగించడానికి వెనుకాడమన్నది వాస్తవమేనని, కానీ.. వ్యాఖ్యలకు అర్థం అణు బాంబుల ప్రయోగం కాదని తేల్చిప్పింది. ఇరాన్ విషయంలో అణు బాంబుల ప్రయోగమనే ఆలోచనే అమెరికాకు లేదని స్పష్టం చేసింది.
48 గంటలు బయటకు రావొద్దు: ఇండియన్ ఎంబసీ
అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయులకు కీలక సూచనలిచ్చింది. 48 గంటల పాటు భారతీయులందరూ ఇళ్లలోనే ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. విద్యుత్ ప్లాంట్లు, సైనిక స్థావరాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. భారీ భవన సముదాయాల్లో ఉన్నవారు వెంటనే, సాధారణ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది.
ఏదైనా ప్రయాణం చేయాల్సి వస్తే, తప్పకుండా రాయబార కార్యాలయం అనుమతి తీసుకోవాలని కోరింది. అత్యవసర సాయం కోసం ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. అధికారిక వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు సమాచారం అప్‌డేట్ చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఇరాన్‌లో సుమారు 8 వేల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 1,862 మందిని ఇప్పటికే, భారత ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
ప్రాణాలిస్తాం!
1.4 కోట్ల మంది పౌరులు ప్రాణత్యాగానికి సిద్ధం
ఒక్క అడుగైనా వెనక్కి తగ్గం.. లొంగిపోయే ప్రసక్తే లేదు
విద్యుత్ కేంద్రాల వద్ద మానవహారాలు చేపడతాం
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్
ట్రంప్ హెచ్చరికలపై తీవ్ర వ్యాఖ్యలు
టెహ్రాన్, ఏప్రిల్ ౭: ‘అమెరికా విధించిన గడువుకు మేం తలొగ్గం. ఒక్క అడు గైనా వెనక్కి తగ్గం. లొంగిపోయే ప్రసక్తే లేదు. మా ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళతాం. 1.4 కోట్ల ఇరానీయన్లు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారు. విద్యుత్ కేంద్రాలు, ముఖ్యమైన మౌలిక సదుపాయాల వద్ద మా పౌరులు మానవహారాలు చేపడతారు’ అంటూ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు.
తాము ఇప్పటి వరకు ఎంతో సహనంతో ఉన్నామని, ఇకపై ఉండబోమవని తేల్చిచెప్పారు. ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల తర్వాత మసౌద్ ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా భావోద్వేగ పూరిత పోస్ట్ పెట్టారు. ఒక దేశ నాగరికతను అంతం చేసి, తిరిగి రాతియుగానికి పంపిస్తామని ఒక దేశాధినేత ప్రకటించడం దారుణమని, ఆ ప్రకటన యుద్ధ నేరం కిందకు వస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
నేరగాళ్ల ముందు మోకరిల్లేవారు, అప్పు డు కాకపోయినా భవిష్యత్తులో మూల్యం చెల్లించు కుంటారని, అది చరిత్ర అనేకసార్లు రుజువు చేసిందన్నారు. తమది యుద్ధోన్మాదం కాదని, కేవలం ఆత్మగౌరవ పోరాటమేనని స్పష్టంచేశారు. అమాయక బాలలను పొట్టన పెట్టుకున్న అమెరికా బాగుపడదని, ఆ దేశ ప్రతిష్ఠ ఇకపై దారుణంగా దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. ఇకపై అమెరికాతో ఇరాన్‌కు ఎలాంటి చర్చలు ఉండవని ప్రకటించారు. అన్నిరకాల దౌత్యపరమైన మార్గాలనూ మూసివేస్తున్నట్లు స్పష్టం చేశా రు. మధ్యవర్తిత్వం వహించే దేశాలన్నీ ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
దేశమంతటా ఉత్కంఠ.. ఆందోళన
తాజా ఉద్రిక్తతలతో టర్కీ, జపాన్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలమైనట్లే అనేది స్పష్టమవతున్నది. అమెరికా విధిస్తున్న డెడ్ లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇరాన్ ప్రజలంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. ఎవరు ఉన్న చోట వారు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒకవైపు దేశాధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రజల్లో ధైర్యం నింపేందుకు అనేక ప్రకటన విడుదల చేస్తున్నారు. అవి కొంతవరకూ ఊరటనిస్తున్నాయి. విద్యుత్ కేంద్రాలు, ముఖ్యమైన మౌలిక సదుపాయాలను కాపాడుకునేందుకు, ఆయా చోట్ల ప్రజలు మానవహారాలుగా ఏర్పడాలని మసౌద్ పిలుపునిచ్చారు. ఆ పిలుపునకు దేశనలుమూలల నుంచీ మద్దతు లభించింది.
అపస్మారక స్థితిలో సుప్రీం కమాండర్
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మజ్తజా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై అంతర్జాతీయ మీడియాలో విస్తృతమైన కథనాలు ప్రసారమవుతున్నాయి. ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనేది కథనాల సారాంశం. ఇరాన్ పవిత్ర నగరమైన కోమ్‌లో చికిత్స పొందుతున్నారని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.




