పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి
- యూత్ డిక్లరేషన్, జాబ్ నోటిఫికేషన్‌పై ఆలోచించే సమయం లేదా?
- బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేష్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి) : 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో కేవలం ఒక్క రోజు యూత్ డిక్లరేషన్, జాబ్ నోటిఫికేషన్‌ల గురించి ఆలోచించే సమయం లేదా? అని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 వేల పోలీస్ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతభత్యాలపై ఆకునూరి మురళి చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రిటైర్డ్ జడ్జీలు సైతం తమ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇంతకంటే దౌర్భా గ్యం ఇంకొకటి ఉంటుందా? అని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో ప్రధానం గా ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, జీవో 46 రద్దు, రాజీవ్ యువ వికాసం లాంటి పథకాలు అమలు చేస్తామని ఆకర్షణీయమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, ప్రభుత్వంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న ఇచ్చిన హామీలు గుర్తు రావడం లేదని,
వీళ్ల ఓట్లతో సీఎం అయిన రేవంత్‌రెడ్డికి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు ఆయన నాయకులకు వీళ్ల గురించి ఆలోచించే తీరికలేదన్నారు. ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్‌రెడ్డి ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగమైనా నోటిఫికేషన్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. నిరుద్యో గ అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఉద్యమిస్తామన్నారు.




