4 September, 2026 | 6:08 AM

సంక్షేమం.. అభివృద్ధితో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రజా ప్రభుత్వం

04-09-2026 | 04:30am

-మంత్రి సీతక్క

ములుగు, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ములుగు జిల్లా ఏటూరునాగారంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క (Minister for Women and Child Welfare Dr. Danasari Anasuya Seethakka) నేతృత్వంలో గురువారం ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా భారీ సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు,

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఏటూరునాగారం ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేదలు, కార్మికులు, ఆదివాసీలు, గిరిజనులు సహా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. వెయ్యి రోజుల కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ప్రజల కష్టాలను పరిష్కరిస్తూ, ప్రతి వర్గానికి అండగా నిలిచేలా ప్రభుత్వం ముందుకు సాగిందన్నారు.

గత వెయ్యి రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సీతక్క ప్రజలకు వివరించారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు, రైతులకు అందిస్తున్న సహాయం,

పేద కుటుంబాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, విద్యా, వైద్య రంగాల్లో చేపట్టిన చర్యలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకువస్తున్నాయని తెలిపారు. మంగపేట, ఎటునాగారం మండలాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో రేషన్ కార్డులు, కుట్టుమిషన్లు, లాప్టాప్ లు మంత్రి పంపిణీ చేశారు.