4 September, 2026 | 6:08 AM

అలుపెరుగని రైతాంగ ఉద్యమసారథి సారంపల్లి

04-09-2026 | 04:30am

సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

మహబూబాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): భూమి సమస్యపై, రైతాంగ సమస్యల పై దివంగత సారంపల్లి మల్లారెడ్డి అలుపెరుగని పోరాటాలు చేశారని  సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీ.వీ రాఘవులు (CPM Politburo Member B.V. Raghavulu) అన్నారు. బుధవారం భీమారంలోని ప్రొద్దుటూరు గార్డెన్స్ లో మల్లారెడ్డి సంతాప సభ సిపిఎం జిల్లా కార్యదర్శి జీ.ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథిగా హాజరైన బీవీ రాఘవులు మాట్లాడుతూ 1956లో సుందరయ్య అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం కోసం తిరిగారని, ప్రాజెక్టులు, కాలువలు కమ్యూనిస్టుల పోరాటం వల్ల వచ్చాయన్నారు.

మల్లారెడ్డి గ్రామంలో సర్పంచ్ గా గెలిచి అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రజల్లో ఉంటే ఆరోగ్యంగా ఉంటాం అని మల్లారెడ్డి ఎప్పుడూ చెబుతుండేవారన్నారు. ఆయన పోలీస్ పటేల్ గా ఉండి ప్రజలకు సేవంచేయడం సాధ్యంకాదని కమ్యూనిస్టు పార్టీలో చేరి, ప్రజలు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారని పేర్కొన్నారు. 

మల్లారెడ్డి లేని లోటు పార్టీకి తీరని లోటు

కేసులు, హత్యలు, నిర్బంధాలను తట్టుకొని నిలబడ్డారు. కుటుంబాన్ని పార్టీలో భాగం చేశారని, నిరంతరం రైతాంగ సమస్యలపై అధ్యయనం చేసి, ఆ సమాచారాన్ని ప్రజా సంఘాలకు, ఎంఎల్‌ఏ, ఎంపీ లకు అందించే వారని ఆయన లేని లోటు పార్టీకి, రైతాంగానికి తీరని లోటు అని రాష్ట్ర సిపిఎం కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మేయర్ టి.రాజేశ్వరరావు మల్లారెడ్డి ప్రజల మనిషిని కొనియాడారు.

వరంగల్ జిల్లాలో సాగునీరు సాగునీరు కోసం రైతాంగ సమస్యల కోసం నిరంతరం ఉద్యమాలు నడిపిన వ్యక్తిని జిల్లాలో ఇండ్లు లేని పేదలను సమీకరించి వేలాదిమంది పేదలకి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేయించి ఇండ్ల స్థలాలు ఇప్పించిన ఘనత సారంపల్లి మల్లారెడ్డి సాధించారని నివాళులర్పించారు.

ఈ సమావేశంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ. నాగయ్య, పోతినేని సుదర్శన్, టి.సాగర్, బి. వెంకట్, సిపిఐ సీనియర్ నాయకులు టి.వెంకట్ రాములు, సిహెచ్ రంగయ్య, వాసుదేవ రెడ్డి, రాగుల రమేష్, చుక్కయ్య, టి.ఉప్పలయ్య, తిరుపతి లతోపాటు వందలాది మంది కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.