ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
- వరద ముంపు, డ్రైనేజీ సమస్యల
- పరిష్కారానికి రూ.20 కోట్ల నిధులు మంజూరు
- టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్
- సాహెబ్ నగర్ కాప్రాయి చెరువు సందర్శన
ఎల్బీనగర్, జూలై 26 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు. సాహెబ్ నగర్ కాప్రాయి చెరువు పరిధిలోని కాలనీలకు ముంపు సమస్య లేకుండా రూ. 20 కోట్లతో నాలాల నిర్మాణంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని సాహెబ్ నగర్ కాప్రాయి చెరువును ఆదివారం సందర్శించి, కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
చెరువు కట్టపై అధ్వాన్న పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. కొందరు ఆకతాయిలు, తాగుబోతులు రాత్రివేళ చెరువు కట్టపై తిరుగుతూ తమకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, వివరించారు. చెరువు కట్టపై సుందరీకరణ, వీధి దీపాల ఏర్పాటు, డ్రైనేజీ నీరు చెరువులో కలవకుండా ప్రత్యేక లైన్ల నిర్మాణంతోపాటు స్థానికులు చెప్పిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి అధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.
సాహెబ్ నగర్ కాప్రాయి చెరువు పరిసర కాలనీ వాసులకు డ్రైనేజీ, వరద నీటి ముంపు సమస్య లేకుండా.. హరిహర పురం, శాతవాహన నగర్, గాంధీనగర్, స్నేహమై నగర్, అఖిలాండేశ్వర్ నగర్ తదితర కాలనీల మీదుగా వరద నీటి నాలా నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా డ్రైనేజీ లైన్ నిర్మించడం ద్వారా చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు చేపట్టేలా అధికారులతో మాట్లాడతామని పేర్కొన్నారు. చెరువుల సుందరీకరణ, మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని పేర్కొన్నారు.
గంజాయి డ్రగ్స్ సేవిస్తూ ప్రజలను ఇబ్బందులు పెట్టే వారిపై స్థానిక పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దగోని లక్ష్మీప్రసన్న , సీనియర్ నాయకులు మకుటం సదాశివుడు, డివిజన్ల అధ్యక్షులు కేతావత్ రమేష్ నాయక్, పర్వతి గణేష్ రెడ్డి, ఎన్‌ఎస్ యూఐ స్టేట్ జనరల్ సెక్రెటరీ వినయ్ పటేల్, నాయకులు సూర్యనారాయణ, విద్యా రెడ్డి, ప్రశాంత్ గౌడ్, భవాని సరస్వతి, మనీష్ గౌడ్, కొత్త శ్రీధర్ గౌడ్, నంద కిశోర్ తదితరులు పాల్గొన్నారు.






