కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండ..
ఆర్థిక సాయం, ఉద్యోగ హామీతో భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి, జులై 15(విజయ క్రాంతి) ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 5 వ వార్డుకు చెందిన ఓ నిరుపేద మహిళ, తన భర్త దివ్యాంగుడు కావడంతో కుటుంబ పోషణ భారమంతా తనపై పడిందని, రోజువారీ జీవనం కూడా ఎంతో కష్టంగా మారిందని ఎమ్మెల్యే మదన్ మోహన్ ని కలిసి తన గోడును వినిపించింది. కుటుంబ పరిస్థితిని వివరించుకుంటూ కన్నీటి పర్యంతమైన ఆమె బాధను ఎమ్మెల్యే మదన్మోహన్ ఎంతో ఓర్పుగా ఆలకించారు.
ఆమె పరిస్థితిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్, తక్షణ ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అండగా నిలిచారు. అంతేకాకుండా, ఆమెకు తగిన ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని, ఎక్కడైనా మంచి ఉద్యోగం వచ్చేలా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే చూపిన ఈ మానవతా దృక్పథానికి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురై కృతజ్ఞతలు తెలిపారు. కష్టాల్లో ఉన్న సామాన్య ప్రజలకు అండగా నిలుస్తూ, వారి సమస్యలను తన సమస్యలుగా భావించి స్పందించడం మదన్ మోహన్ గారి సేవా భావానికి నిదర్శనమని స్థానికులు కొనియాడారు.






