పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం
అర్హులకు రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
మంగపేట, మే 28 (విజయక్రాంతి): దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ పేదలకు అండగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిలబడుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందని, అర్హులైన లబ్ధిదారులకు రెండో విడత లో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామ ని, ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని మంత్రి సీతక్క కోరారు.
గురువారం మంగపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క ము ఖ్య అతిథిగా హాజరై, మంగపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.
ఆడబిడ్డల వివాహ సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా నిరోధించాలని, చట్టబద్ధమైన వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే వివాహాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిర్మూలనకు సహకరించాలని, బాలికల విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులకు రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సంఘ సభ్యులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, మంగపేట తహసీల్దార్ తోట రవీందర్, స్థానిక ప్రజాప్రతి నిధులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.






