13 April, 2026 | 3:41 AM

ప్రేమికుడి కల కోసం పోరాడే క్వీన్

13-04-2026 01:55 AM

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ల్ఫుయెన్సర్ యామినీ ఈఆర్‌ను హీరోయిన్‌గా పరిచయమవుతున్న చిత్రం ‘క్వీన్’. యంగ్ డైరెక్టర్ రతన్ రిషి ఈ సినిమాను హీరోయిన్ సెంట్రిక్ కథతో రూపొందిస్తున్నారు. వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ ప్రతినాయకులుగా నటిస్తున్నారు.

ఇంకా ఈ సినిమాలో ఎంతో ప్రత్యేకంగా, ఆసక్తికరంగా ఉండే కథానాయిక తండ్రి పాత్రలో తొంభైల నాటి ఒక హీరో కనిపించనున్నారు. ప్రస్తుత సమాజంతో ముడిపడి ఉన్న ఒక ఆసక్తికరమైన ప్రేమకథను ఈ చిత్రంలో చూపించనున్నారు దర్శకుడు రతన్ రిషి.

తను ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేస్తూ, అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసిందనేది ఈ చిత్రంలో ఆద్యంతం ఆసక్తిని కలిగించనుంది. అయితే, ఆదివారం కథానాయకి యామినీ ఈఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో క్లాసికల్ డాన్సర్ గెటప్‌లో అందంగా ముస్తాభైన యామిని.. ఆనందబాష్పాలతో కనిపించి ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతం: భరత్ ఎం; డీవోపీ: సరస్; కొరియోగ్రఫీ: జేడీ మాస్టర్; ఆర్ట్: భార్గవ నౌండ్ల; ఎడిటింగ్: ఆర్ ఎం విశ్వనాథ్ కుచనాపల్లి.