22-01-2026 12:00:00 AM
వరంగల్ మార్కె ట్‌లో 3,000కు పెరిగిన ధర
వరంగల్(మహబూబాబాద్), జనవరి 21 (విజయక్రాంతి): తేజ, వండర్ హాట్ మిర్చి రకం ధర ఒక్కరోజులోనే అనూహ్యంగా 3,000 నుంచి 4 వేల వరకు పెరిగాయి. మంగళవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో తేజ రకం కొత్త మిర్చి క్వింటాల్ ధర 17,000 రూపాయలు గరిష్టంగా లభించగా, వండర్ హాట్ రకానికి 22 వేల రూపాయలు లభించింది. ఇక బుధవారం ఏకంగా తేజ మిర్చి రకానికి 3,000 రూపాయలు, వండర్ హాట్ రకానికి 4,000 పెరిగింది.
తేజ మిర్చికి గరిష్టంగా క్వింటాల్‌కు 20,200 రూపాయల ధర లభించగా, వండర్ హాట్ రకానికి క్వింటాలకు గరిష్టంగా 26,200 రూపాయల ధర లభించింది.ఇదేవిధంగా 341 మిర్చి రకానికి కూడా వెయ్యి రూపాయల ధర పెరిగింది. వరంగల్ ఏనుమాముల మార్కెట్ కు బుధవారం తేజ మిర్చి రకం 1,500 బస్తాలు రాగా, వండర్ హాట్ రకం 100 బస్తాలు వచ్చింది. 2023లో తేజ రకం మిర్చికి ఈ ధర ఉండగా ఇప్పుడు మళ్లీ 20,000 మార్క్ ధర రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మిర్చి ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది సాగు చేసిన మిర్చి పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. అధిక వర్షాల వల్ల వేరు కుళ్లు వల్ల పంట దిగుబడి బాగా తగ్గిందని, దీనివల్ల మిర్చికి డిమాండ్ పెరిగినట్లు భావిస్తున్నారు.