పెద్దకొత్తపల్లి రెవెన్యూశాఖలో ప్రతి పనికో రేటు!-
- సోషల్ మీడియాలో బాధితుడి వీడియో వైరల్
- స్పందించని రెవెన్యూ అధికారులు
నాగర్‌కర్నూల్, ఆగస్టు 17 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల రెవెన్యూ శాఖలో వివిధ పనులకు ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఓ బాధితుడు చేసిన ఆరోపణలు కలకలం రేపుతు న్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు రూ.2 వేలు, రిజిస్ట్రేషన్కు ఎకరాకు రూ.5 వేలు, సంతకాల కోసం పనిని బట్టి రేట్లు నిర్ణయిస్తున్నారని బాధితుడు ఆరోపించారు.
కొన్ని పనులకు రూ.50 వేల వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని, మండలంలోని 24 గ్రామాల నుంచి నెలకు రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించాడు. సుమారు 50 మంది బాధితుల నుంచి తీసుకున్న డబ్బులు ఏడు రోజు లుగా తిరిగి ఇవ్వలేదని తమ వద్ద ఉన్న ఆధారాలను ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అం దజేస్తామన్నారు. ఈ ఆరోపణలపై రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ కాలేదు. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.






