17 March, 2026 | 1:59 PM

ఎన్నికల్లో పంచిన డబ్బును తిరిగి ఇవ్వాలని అభ్యర్థన..

13-12-2025 07:21 PM

చేతిలో దేవుడు ఫోటో, పురుగుల మందు డబ్బాతో...

ఇంటింటికి తిరిగిన ఓడిన అభ్యర్థి దంపతులు..

చిట్యాల (విజయక్రాంతి): మొదటి విడత స్థానిక ఎన్నికలలో సర్పంచ్ గా పోటీ చేసి ఓడిన అభ్యర్థి పంచిన డబ్బును తిరిగి ఇవ్వాలంటూ గ్రామస్తులను కలిసి అభ్యర్థి దంపతులు ఒకరు చేతిలో దేవుడు ఫోటో పట్టుకొని, అతని భార్య పురుగుల మందు డబ్బాతో ఇంటింటికి తిరిగిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఔరవాణి గ్రామంలో మొత్తం ఓట్లు 1490 ఉండగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జక్కల పరమేష్ కు 973 ఓట్లు రాగా, బీఆర్ఎస్ బలపరిచిన కల్లూరి బాలరాజుకు 517 ఓట్లు వచ్చాయి గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కల్లూరి బాలరాజు అభ్యర్థి గ్రామంలో ఓటుకు రూ 2 వేలు రూపాయలు డబ్బు పంచినప్పటికీ 456 ఓట్లతో బాలరాజు ఓడిపోయాడు.

ఇంత డబ్బు పంచిన మెజారిటీ రాకపోవడంతో బాలరాజు దంపతులు ఒకరు చేతిలో దేవుడు ఫోటో పట్టుకొని, అతని భార్య పురుగుల మందు డబ్బాతో ఇంటింటికి తిరిగి ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని, నిజాయితీగా నాకు ఓటు వేసిన వారు అవసరం లేదని, వేయనివారు కచ్చితంగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలంటూ గ్రామస్థులతో బాలరాజు వాగ్వాదం చేశాడు. యాభై లేదా వంద ఓట్ల తేడాతో ఓడిపోతే ఏమైనా అనుకోవచ్చు కానీ ఇంత డబ్బు పంచినా ప్రత్యర్థి అయినా జక్కల పరమేశ్ కు భారీ ఎత్తున మెజారిటీ ఎలా వచ్చిందంటూ గ్రామస్థులతో బాలరాజు దంపతులు వాగ్వాదానికి దిగారు.

గ్రామస్తులు సైతం బాలరాజు దంపతులకు ఎదురు వాగ్వాదానికి దిగారు. మీ ఇంటికి ఏమైనా డబ్బులు ఇవ్వమని వచ్చామా అంటూ గట్టిగానే నిలదీశారు. గ్రామంలోని ప్రజలు ఇటువంటి సంఘటనలు ప్రతి ఓటర్ కు ఒక కనువిప్పు కావాలని, ఓట్ల ముందు డబ్బులు తీసుకుని ఓటు వేస్తే ఇలాంటి పరిస్థితులే గ్రామ ప్రజలకు ఎదురవుతాయని , ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీగా ఓటు వేసి సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.