ఆస్తి కోసం మామ హత్య
పక్కాగా ప్లాన్‌చేసి హతమార్చిన కోడలు
నాగపూర్, జూన్ 12: ఆస్తి కోసం సొంత మామను ఓ కోడలు దారుణంగా హత్య చేయించింది. నాగపూర్‌లో ఈ దారుణం చోటుచేసుకొన్నది. పట్టణంలో నివసించే పురుషోత్తం పుట్టేవార్ కుటుంబానికి దాదాపు రూ.300 కోట్ల ఆస్తిపాస్తులున్నాయి. వాటిని సొంతం చేసుకోవాలంటే పురుషోత్తంను అంతమొందించాలని ఆయన కోడలు అర్చనా మానిష్ పుట్టేవార్ భావించింది. టౌన్ ప్లానింగ్ ఉద్యోగి అయిన ఆమె, తన చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చేయాలని ప్రయత్నించింది. అందుకు పక్కాగా ప్లాన్ వేసింది. మామను చంపేందుకు తన భర్త కారు డ్రైవర్‌కే సుపారీ ఇచ్చింది.
అతడు మరికొంతమందితో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. ఆ ముఠాకు అర్చన రూ. కోటి ముట్టజెప్పింది. ఆ డబ్బుతో వారు ఓ పాత కారును కొనుగోలు చేసి, దానితోనే ఇటీవల పురుషోత్తంను ఢీకొట్టి చంపేశారు. దవా ఖానలో ఉన్న తన భార్య శకుంతలను చూసేందుకు వెళ్లి తిరిగి ఇంటి కి వస్తున్న పురుషోత్తంను కారుతో ఢీకొట్టారు. మొదట దీన్ని రోడ్డు ప్రమాదంగానే భావించారు. కానీ, సందేహం వచ్చిన పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించటంతో విషయం మొత్తం బయట పడింది. డ్రైవర్ బాగ్డేతోపాటు నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్ అనే మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో అర్చన ఆదేశాల మేరకే తాము ఈ హత్య చేశామని వారు అంగీకరించారు. ఆమె నిబంధనలకు విరుద్ధంగా లేఔట్లకు అనుమతులిచ్చారని గుర్తించారు.






