పటిష్టంగా గ్రామస్థాయిలో పోలీసింగ్ వ్యవస్థ
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్
మహబూబాబాద్, జులై 20 (విజయక్రాంతి): గ్రామ స్థాయిలో పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని గార్ల పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న స్టేషన్ రికార్డులు, కేసు దర్యాప్తు ఫైళ్లు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ నిర్వహణ, మాల్ఖానా, రిసెప్షన్, రికార్డు నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తు నాణ్యతను పెంచుతూ, చట్టపరమైన విధానాలను పాటిస్తూ త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై వారి విధుల నిర్వహణ, సమస్యలు, పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా విలేజ్ పోలీస్ ఆఫీసర్లతో ప్రత్యేకంగా మాట్లాడి, తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శిస్తున్నారా, గ్రామాలపై పూర్తి అవగాహన ఉందా, గ్రామ పెద్దలు, యువత, ప్రజాప్రతినిధులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలీసు సిబ్బంది తమ విధిని కేవలం ఉద్యోగంగా కాకుండా బాధ్యతగా,
అంకితభావంతో నిర్వహించాలని, ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ సత్వర స్పందన అందించాలని ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి స్నేహపూర్వక వాతావరణంలో సేవలు అందించాలని, ఫిర్యాదులను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.






