3 June, 2026 | 1:34 AM

అమరుల త్యాగాలతోనే ప్రత్యేక రాష్ర్టం

03-06-2026 01:04 AM
  1. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం
  2. ధాన్యం అమ్మకాల్లో రైతులకు ఇబ్బందులు తీర్చుతాం
  3. సూర్యాపేటలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట, జూన్ 2 (విజయక్రాంతి): అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన రాష్ర్టం తెలంగాణ అని, దాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి వాటిని విజయవంతంగా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 6 గ్యారంటీలలో భాగంగా మహిళల సంక్షేమం, సాధికారత కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకం ద్వారా ఉచిత బస్ ప్రయాణం కల్పించామన్నారు. జిల్లాలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పనుల గురించి మంత్రి వివరించారు.

ఇప్పటివరకు మొత్తం 5 కోట్ల 13 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని పొంది రూ.307 కోట్ల 20 లక్షల మొత్తాన్ని ఆదా చేసుకున్నారని చెప్పారు. అలాగే రూ. 500 కు ఎల్పీజీ గ్యాస్ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలపై గృహ వినియోగ వ్యయ భారం తగ్గిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత 46 వేల 587 కొత్త కార్డులు అర్హులకు కొత్త కార్డులు ఇచ్చినట్టు తెలిపారు. జిల్లాలో మొత్తం 313  కొనుగోలు కేంద్రాల ద్వారా 3,39,847 టన్నుల ధాన్యం 48,897 మంది రైతుల వద్ద కొని, రూ.810 కోట్ల వెచ్చించినట్టు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం సన్న రకం వడ్ల పై 500 రూపాయలు బోనస్ ప్రకటించడం వల్ల సన్న వరి సాగు అనూహ్యంగా పెరిగిందన్నారు. రాజీవ్ గాంధీ హౌసింగ్ కాలనీ హుజుర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో సీతా రామస్వామి గుట్ట వద్ద 2,160 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ పాల్గొన్నారు.